అంత ఫిట్‌గా కనిపించే నాగ్ కూడా…

టాలీవుడ్ హీరోల్లో ఫిట్నెస్‌‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వాళ్లలో ముందు చెప్పుకోవాల్సింది నాగార్జున గురించే. 60 ఏళ్లు పైబడ్డప్పటికీ.. యువ కథానాయకులతో పోటీ పడే స్థాయిలో ఆయన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. మామూలుగా నాగ్‌ను చూపించి ఎంత వయసంటే 40 అంటారేమో. ఆయన పెద్ద ఫిట్నెస్ ఫ్రీక్ అని టాలీవుడ్లో ఎవరిని అడిగినా చెబుతారు.

ఇన్నేళ్లలో నాగ్ బయట ఎప్పుడూ కూడా అనారోగ్యంతో ఉన్నట్లు కానీ.. నిరుత్సాహంతో కానీ కనిపించింది లేదు. అయితే బయటికి చూపించి ఉండకపోవచ్చు కానీ.. నాగ్ సైతం కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో బాధ పడ్డాడట. ఒక సమయంలో నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డట్లు నాగ్ వెల్లడించాడు. ఆ సమయంలో కూర్చోలేక, నిల్చోలేక బాధ పడ్డట్లు నాగ్ తెలిపాడు. ఐతే తాను ఇలా బాధ పడుతున్నట్లు ఎవరికీ చెప్పుకోలేదని నాగ్ చెప్పాడు.

ఎన్నో సంవత్సరాలుగా విరామం లేకుండా సినిమాల్లో నటిస్తూ ఉండటం.. డ్యాన్సులు ఫైట్లు చేయడం వల్ల ఆరేళ్ల కిందట తనకు నడుం నొప్పి, మోకాళ్ల నొప్పి వచ్చాయని నాగ్ వెల్లడించాడు. అలాంటి సమయంలో తనకు స్నేహితులు కొందరు స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి చెప్పారని.. దాని వల్ల తాను కోలుకుని మళ్లీ ఆరోగ్యవంతుడినయ్యానని.. చాలా బాగా పని చేసిన ఆ ట్రైనింగ్ గురించి ఆ తర్వాత తన స్నేహితులందరికీ చెప్పానని నాగ్ వెల్లడించాడు. శారీరకంగానే కాక మానసికంగానూ ఆరోగ్యంగా ఉన్నపుడే మనం ఫిట్‌గా ఉన్నట్లు అని నాగ్ అభిప్రాయపడ్డాడు. అందుకే తాను ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తానన్నాడు.

గత కొన్నేళ్లలో నాగ్ నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఓం నమో వేంకటేశాయ, ఆఫీసర్, మన్మథుడు-2 అయితే ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి. దేవదాస్ సైతం నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో నాగ్ ఆశలన్నీ ‘వైల్డ్ డాగ్’ మీదే ఉన్నాయి.