చంద్రబాబు అడుగుజాడల్లో జగన్ .. గుణపాఠం నేర్చుకోలేదా ?

అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబునాయుడు అడుగుజాడల్లోనే నడుస్తున్నాడా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు చేసిన దానికి జగన్ ఇపుడు చేస్తున్న దానికి కాస్త తేడా ఉన్నా మొత్తం మీద రిజల్టయితే ఒకటే. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదూ. అదేనండి టిడిపి నేతలను వైసిపిలోకి చేర్చుకునే విషయం గురించే ఇదంతా. నిజానికి టిడిపి నేతలను వైసిపిలో చేర్చుకోవాల్సిన అవసరం జగన్ కు ఎంతమాత్రం లేదనే చెప్పవచ్చు. ఇపుడు వైసిపిలో చేరిన నేతలు టిడిపిలో ఉన్నపుడు మొన్నటి ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయిన వారే. మరలాంటపుడు ఇప్పటికిప్పుడు వారిని అర్జంటుగా పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం జగన్ కు ఏమొచ్చిందో అర్ధంకావటం లేదు.

కాకినాడ ఎంపిగా పోటి చేసిన చలమలశెట్టి సునీల్, అంతకుముందు వైజాగ్ లో పంచకర్ల రమేష్ ను వైసిపిలో చేర్చుకున్నారు. నిజానికి వీళ్ళిద్దరి వల్ల పార్టీకి జరిగే లాభం కూడా ఏమీ లేదు. లాభం లేకపోగా నష్టమైతే ఖాయంగానే కనిపిస్తోంది. ఎలాగంటే పాత నేతలతో కొత్త నేతలు కలవటం దాదాపు కష్టమనే చెప్పాలి. వీళ్ళ ఐడియాలజీ వేరు వర్కింగ్ స్టైలు వేరుగా ఉంటుంది. దాంతో టిడిపి నుండి వచ్చి చేరిన ప్రతి నియోజకవర్గంలోను గ్రూపు రాజకీయాలు మొదలవ్వటం ఖాయం.

ఇప్పటికే ఈ విషయం గన్నవరం, చీరాలలో స్పష్టమైంది. గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ, చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్ ఇంకా పార్టీలో చేరకుండానే అక్కడ మంటలు మండుతున్నాయి. తాజాగా వైజాగ్ జిల్లాలో మరో ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కూడా టిడిపికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డికి జిందాబాద్ కొట్టారు. తాజాగా చిత్తూరు జిల్లాలో మాజీ ఎంఎల్ఏ డికే సత్యవతి కుటుంబం కూడా వైసిపిలో జాయిన్ అవుతుందని అంటున్నారు.

చీరాల, గన్నవరంలో టిడిపి ఎంఎల్ఏలు పార్టీలో చేరకుండానే తమ నియోజకవర్గాల్లో వైసిపి నేతలపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో మొన్నటి ఎన్నికల్లో వీళ్ళపై పోటి చేసి ఓడిపోయిన నేతలకు మండిపోతోంది. ఫలితంగా పై రెండు నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలతో పాటు వాళ్ళ మద్దతుదారుల మధ్య ప్రతిరోజు గొడవలవుతున్నాయి. గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరి కూడా టిడిపిలో నుండి బయటకు వచ్చేసి జగన్ కే మద్దతుగా ఉంటున్నాడు. ఇక్కడ పెద్దగా గొడవలు కావటం లేదు. ఎందుకంటే గిరి చాలా లో ప్రొఫైల్ పాటిస్తున్నాడు.

కళ్ళ ముందే గొడవలు జరుగుతున్న నియోజకవర్గాలను చూసిన తర్వాత కూడా జగన్ మళ్ళీ టిడిపి నేతలను చేర్చుకుంటున్నాడంటూ గుణపాఠం నేర్చుకోలేదని అర్ధమైపోతోంది. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు కూడా ఫిరాయింపులను ప్రోత్సహించాడు. వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, 3 ఎంపిలను టిడిపిలోకి లాగేసుకున్నాడు. దాంతో ఏమైంది ? ఏమైందంటే వైసిపి నుండి వచ్చిన ఎంఎల్ఏల నియోజకవర్గాల్లోని నేతల మధ్య గొడవలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కర్నూలు జిల్లాలోని కోడుమూరు, కడప జిల్లాలోని బద్వేలు లాంటి చోట్ల టిడిపి+ఫిరాయుంపు నేతల వర్గాల నేతలు పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. 23 మంది ఫిరాయింపు ఎంఎల్ఏల్లో చంద్రబాబు 17 మందికి టికెట్లిస్తే గెలిచింది ఒకే ఒక్కడు.

అప్పట్లో అవసరం లేకపోయినా జగన్ పైన కోపంతో చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించాడరు. ఇపుడూ అవసరం లేకపోయినా టిడిపి నేతలను జగన్ పార్టీలోకి చేర్చుకుంటున్నాడరు. ఇద్దరి మధ్య తేడా ఏమిటంటే ఎంఎల్ఏల ఫిరాయింపులను జగన్ డైరెక్టుగా ప్రోత్సహించటం లేదంతే. మిగితా అంతా సేమ్ టు సేమ్ అనే చెప్పాలి. మొత్తం మీద చూస్తే జగన్ చర్యలతో పార్టీకి నష్టం జరగటం ఖాయమనే అనిపిస్తోంది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.