మేం టీఆర్ఎస్ లా కాదు…హరీశ్ కు బాలినేని కౌంటర్

కేంద్రం చేపట్టిన విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విద్యుత్ సంస్కరణలకు ఏపీ వంటి కొన్ని రాష్ట్రాలు సుముఖంగా ఉండగా తెలంగాణతోపాటు మరి కొన్ని రాష్ట్రాలు విముఖంగా ఉన్నాయి. ఆ సంస్కరణలకు అనుగుణంగా ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకుగాను స్మార్ట్ మీటర్లు బిగించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలోనే ఆ విషయంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇస్తామన్న రూ.4 వేల కోట్లకు ఆశపడి మీటర్లు బిగించేందుకు ఏపీ సర్కార్ సమ్మతించిందని హరీశ్ ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం ఇస్తాననన్న రూ.2,500 కోట్లు తాము వదులుకున్నామని, ఆ డబ్బులకు కక్కుర్తి పడి రైతుల మెడకు ఉరితాడు బిగించలేమని హరీశ్ షాకింగ్ కామెంట్లు చేశారు. హరీశ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.

తమ ప్రభుత్వం… టీఆర్ఎస్ ప్రభుత్వంలా కాదని, కేంద్రంతో ఒక రోజు మంచిగా ఉండి…మరో రోజు గొడవ పడడం వంటివి చేయమని బాలినేని చురకలంటించారు. కేంద్రంతో ఏపీ సఖ్యతగా ఉంటే తప్పేమిటని బాలినేని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉండడం తప్పెలా అవుతుందని బాలినేని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే రూ.4 వేల కోట్ల నిధులను ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామని, ఆ డబ్బులు ఎవరి జేబుల్లో వేసుకోబోమని బాలినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల బిల్లులకు సంబంధించి డిస్కంలకు చెల్లించవలసిన మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తామని, ఇందులో అనుమానించాల్సిందేమీ లేదని హరీశ్ వ్యాఖ్యలకు బాలినేని కౌంటర్ ఇచ్చారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం ద్వారా రైతులకు గతంలో మాదిరిగానే ఉచిత విద్యుత్ అందిస్తామని, ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని ఏపీ సర్కార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే.