బాలు మరణం.. ఆసుపత్రి ఏమందంటే?

నెలన్నర కిందట తనకు కరోనా సోకినట్లుగా చాలా మామూలుగా వీడియో ద్వారా ప్రకటించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని.. తాను చాలా బాగున్నానని.. తనకు ఎవరూ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దని నవ్వుతూ చెప్పారు బాలు. దీంతో ఆ విషయాన్ని అందరూ తేలిగ్గానే తీసుకున్నారు.

కానీ తన అభిమానులతో బాలు చెప్పిన చివరి మాటలు అవే అవుతాయని ఎవరూ ఊహించలేదు. మధ్యలో పరిస్థితి విషమించినట్లు వార్తలొచ్చినా.. ఆ తర్వాత కోలుకుని మామూలు మనిషి అవుతున్నట్లుగా బాలు తనయుడు చరణ్ ఇచ్చిన వీడియో సందేశాలు అందరికీ ఊరటనిచ్చాయి. మొన్నటి వరకు కూడా అంతా బాగున్నట్లే కనిపించింది. కానీ 24 గంటల వ్యవధిలో పరిస్థితి మొత్తం మారిపోయింది. బాలు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో బాలుకు చికిత్స అందించిన ఎంజీఎం ఆసుపత్రి ఆయన మరణం గురించి బులిటెన్ విడుదల చేసి.. బాలు ఆరోగ్యం విషయంలో ఎప్పుడేం జరిగిందో అధికారికంగా వివరించింది. కరోనా బారిన పడ్డ బాలు ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరారు. ఆ నెల 14వ తేదీన ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కోవిడ్‌ కారణంగా తలెత్తిన న్యుమోనియా వ్లల ఊపిరి తిత్తులు సరిగా పని చేయకపోవడంతో లైఫ్ సపోర్ట్ మీదికి వెళ్లాల్సి వచ్చింది.

అప్పట్నుంచి ఎక్మోతో పాటు వెంటిలేటర్ ద్వారా ఆయనకు శ్వాస అందిస్తూ చికిత్స కొనసాగిస్తున్నారు. సెప్టెంబరు 4న బాలుకు కరోనా నెగెటివ్ వచ్చింది. ఐతే సెప్టెంబరు 24న, బుధవారం ఉన్నట్లుండి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. శుక్రవారం ఉదయం పరిస్థితి మరింత క్షీణించి గుండెపోటుకు గురయ్యారు బాలు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాల్ని నిలబెట్టలేకపోయారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఇదీ ఎంజీఎం ఆసుపత్రి విడుదల చేసిన బులిటెన్ సారాంశం.