తప్పులో కాలేసిన మంత్రి కొడాలి !

ఆవేశపరుడైన మంత్రి కొడాలి నాని తప్పులో కాలేశాడా ? తాజాగా ఆయన మాటలు వింటే అవుననే సమాధానం వస్తుంది. చంద్రబాబునాయుడు అంటేనే కొడాలి ఒంటికాలిపై లేస్తారన్న విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపణైంది. జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావటం, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించటం అనే విషయం రాజకీయంగా చాలా వివాదమైంది. శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించేముందే జగన్ డిక్లరేషన్ ఇచ్చేట్లుగా ఒత్తిడి పెట్టాలంటు చిత్తూరు జిల్లాలోని నేతలకు చంద్రబాబు అదేపనిగా ఆదేశించారు. ఈ క్రమంలో తొలుత చంద్రబాబుపై, తదుపరి ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు నాని. మోడీపై నాని చేసిన విమర్శ అబద్ధం అని ప్రచారం జరుగుతుండటంతో అతను ఇరుక్కుపోయినట్లు అర్థమవుతోంది.

శ్రీవారికి పట్ టువస్త్రాలు సమర్పించేటపుడు జగన్ సతీ సమేతంగా ఆలయంకు రావాలని పదే పదే చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రి మాట్లాడుతూ మోడిని కూడా పిక్చర్లోకి లాగడమూ తెలిసిందే. ఆయోధ్యలో జరిగిన రామజన్మభూమి శంకుస్ధాపనలో భార్య లేకుండానే మోడి ఒక్కడే ఎలా పూజలో పాల్గొంటాడంటూ నిలదీశారు. మోడితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ను కూడా వివాదంలోకి లాగేశారు లేండి.

అయితే ఇక్కడే మంత్రి పెద్ద పొరబాటు చేశారు. ఏదన్నా విషయాన్ని మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడాలి. అయోధ్యలో పూజలు చేసింది మోడి కాదు. శంకుస్ధాపన కార్యక్రమంలో పూజ చేసింది సలిల్ సింఘాల్, మధు సింఘాల్ దంపతులు. సలీల్ సింఘాల్ ఎవరయ్యా అంటే రామజన్మభూమి అంశాన్ని మొదటినుండి భుజాన మోసిన విశ్వహిందు పరిషత్ చీఫ్ అశోక్ సింఘాల్ సోదరుడు. అశోక్ సింఘాల్ ఇపుడు లేరు కాబట్టి ఆయన మీద గౌరవంతో ఆయన సోదరుడితో పూజలు చేయించారు.

శంకుస్ధాపన కార్యక్రమంలో చాలాసేపు పూజలు జరిగినా అందరికీ తెలిసింది నరేంద్రమోడి, యోగి ఆదిత్యనాధే కాబట్టి అందరి దృష్టి వీళ్ళ మీదే ఉంది. సలీల్ దంపతులు ఎవరో చాలామందికి తెలీదు కాబట్టి వీళ్ళని ఎవరు పట్టించుకోలేదు. పూజ చేసింది ఈ దంపతులైతే మోడి, ఆదిత్యనాథ్ లు కేవలం పక్కన కూర్చున్నారంతే. ఈ విషయం తెలీకుండానే మంత్రి కొడాలి నాని అనవసరంగా మోడి, ఆదిత్య నాథ్ పై నోరు పారేసుకున్నాడు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నోరు పారేసుకున్న వాళ్ళే అందరిముందు పలుచనైపోతారు.