ఒకే ఒక తప్పు రాజకీయ జీవితాన్నే తల్లక్రిందలు చేసేసిందా ?

ఒకే నిర్ణయం రాజకీయ జీవితాన్ని తల్లకిందులు చేసేసింది. అప్పట్లో తాను వేసిన అడుగు తప్పటడుగు అని తెలిసుకునేటప్పటికే అంతా అయిపోయింది. అప్పుడు చేసిన పనికి ఇపుడు తీరిగ్గా పశ్చాత్తాపడుతున్నారు. ఇదంతా ఎవరి గురించంటే మాజీ ఎంపి బుట్టా రేణుక గురించే. 2014 ఎన్నికల్లో వైసిపి తరపున కర్నూలు ఎంపిగా పోటి చేసేంతవరకు చాలామందికి అసలు బుట్టా రేణుకంటే ఎవరో కూడా తెలీదు. పార్టీకి విధేయతతో ఉంటుందని, చదువుకున్న మహిళని, విషయ పరిజ్ఞానం ఉన్నదన్న నమ్మకంతోనే బుట్టాకు జగన్మోహన్ రెడ్డి ఎంపి టికెట్ ఇచ్చారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో బిసిలు ఎక్కువగా ఉండటంతో బుట్టా కూడా పోటి చేసిన మొదటిసారే గెలిచారు.

కష్టపడి బుట్టాను గెలిపించుకుంటే ఏమి చేశారు ? మొదట్లో వైసిపిలో చురుగ్గానే ఉన్నా తర్వాత చంద్రబాబునాయుడు ప్రలోభాలకు లొంగిపోయి టిడిపిలోకి ఫిరాయించారు. తాను నేరుగా టిడిపిలో చేరకుండానే చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. టిడిపి సమావేశాల్లో కూడా బుట్టా కనిపించారు.

2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వటంతో పాటు అవసరమైన ఆర్ధిక సాయం చేస్తానని పార్టీ ఫిరాయింపు సందర్భంగా చంద్రబాబు ఎంపికి హామీ ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఏమి జరిగింది? 2019 ఎన్నికలు వచ్చేసరికి టిడిపిలో బుట్టా ఇమడలేకపోయారు. దానికి తోడు కాంగ్రెస్ లో కీలకనేత అయిన కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చంద్రబాబు పార్టీలోకి తీసుకొచ్చారు.

ఎన్నికల్లో పార్టీ తరపున కర్నూలు ఎంపిగా కోట్లకే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. తనకు జరిగిన అన్యాయంపై చంద్రబాబుతో మాట్లాడేందుకు బుట్టా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోయింది. అంతకుముందే పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటి చేయమని చంద్రబాబు చేసిన సూచనకు బుట్టా అంగీకరించలేదు.

ఎందుకు అంగీకరించలేదంటే ఎంఎల్ఏలు, నియోజకవర్గ స్ధాయి నేతలు ఏరోజూ బుట్టాను తమతో కలుపుకుని వెళ్ళలేదు. చంద్రబాబుతో మాట్లాడుకున్న బుట్టా టిడిపిలోకి తన మద్దతుదారులను పంపారు. తాను కూడా అనధికారికంగా టిడిపి ఎంపిగానే మెలిగారు. అయితే జిల్లా పార్టీలో మాత్రం ఏ నేత కూడా బుట్టాను ఓ నేతగా గుర్తించలేదు.

బుట్టా పరిస్ధితి ఎందుకు ఇలాగైపోయింది ? ఎందుకంటే తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకోవటమే ప్రధాన కారణం. తాను వైసిపి తరపున పోటి చేసింది కాబట్టే ఎంపిగా గెలిచానన్న విషయాన్ని మరచిపోయింది. జగన్ను చూసే తనకు ఓట్లేసి గెలిపించారన్న విషయం మరచిపోయిన బుట్టా తన గొప్ప వల్లే గెలిచానని భ్రమపడింది.

అందుకనే పిలిచి టికెట్ ఇచ్చి ఆధరించిన జగన్ దెబ్బకొట్టి టిడిపితో చేతులు కలిపింది. అయితే మళ్ళీ ఎన్నికలు వచ్చేసమయానికి వాస్తవం ఏమిటో అర్ధమైంది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇటు వైసిపిలోకి వెళ్ళలేక అటు టిడిపిలో కంటిన్యు అవ్వలేక నానా అవస్తలు పడింది.

అందుకనే చేసేది లేక ఎన్నికలకు ముందే చేసిన తప్పుకు చెంపలేసుకున్నారు. మళ్ళీ జగన్ దగ్గరకే వచ్చి పశ్చాత్తాపం ప్రకటించారు. భేషరుతుగా వైసిపిలో చేరుతానని చెప్పటంతో జగన్ కూడా సరే అన్నారు. దాంతో తన మిత్రుడు, వైసిపి అభ్యర్ధి సంజీవరెడ్డి గెలుపుకు బుట్టా కృషి చేయాల్సొచ్చింది. తాను వైసిపిని కాదని టిడిపిలో చేరి పెద్ద తప్పు చేశానంటూ బహిరంగంగా మీడియా ముందు బుట్టా క్షమాపణలు చెప్పినా ఉపయోగం లేకపోయింది.

ఎంతో భవిష్యత్తు ఉంటుందని అనుకున్నా తాను చేసిన ఒకే ఒక తప్పుతో బుట్టా రాజకీయ జీవితమే తల్లకిందులైపోయింది. ఇపుడు అధికారపార్టీలోనే ఉన్నా ఆమెను ఎవరు పట్టించుకోవటం లేదట. అందుకు తన రాజకీయ భవిష్యత్తు ఏమిటో అర్ధంకాక బుట్టా దిక్కులు చూస్తోందిపుడు.