నోలన్ సినిమాకు భారీ నష్టం

ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేయొచ్చు. మొమెంటో, బ్యాట్‌మ్యాన్, ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, డన్‌కిర్క్ లాంటి అద్భుతమైన సినిమాలతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడతను.

క్రిస్టఫర్ నోలన్ సినిమా అంటే టాక్‌తో సంబంధం లేకుండా వేల కోట్ల వసూళ్లు వచ్చేస్తాయి. చివరగా అతను తీసిన ‘డన్‌కిర్క్’ మూడేళ్ల కిందటే 527 మిలియన్ డాలర్లు (రూపాయల్లో 3880 కోట్లు) కొల్లగొట్టింది. దీని తర్వాత నోలన్ తీసిన ‘టెనెట్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

ఐతే మరీ ఎక్కువ కాలం ఎదురు చూడలేక ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతుండగా, చాలా చోట్ల థియేటర్లు మూత పడి ఉండగానే దీన్ని రిలీజ్ చేసేశారు. ఐతే ఈ చిత్రం విడుదలై నెల రోజులు కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 200 మిలియన్ డాలర్ల వసూళ్లే వచ్చాయి. మామూలు రోజుల్లో అయితే అంతకు రెట్టింపు కన్నా ఎక్కువే వసూళ్లు రావాలి.

అమెరికాలో ఈ చిత్రానికి మినిమం 100 మిలియన్ డాలర్లు వసూళ్లు వచ్చి ఉండాలి. కానీ అక్కడ వసూలైంది 30 మిలియన్ డాలర్లు మాత్రమే. న్యూయార్క్, కాలిఫోర్నియా లాంటి పెద్ద రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోకపోవడం, మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతుండటం వల్ల వసూళ్లలో భారీగా కోత పడింది. ఈ సినిమాకు టాక్ విషయంలో ఢోకా లేదు. రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి.

కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా థియేటర్లు పూర్తి స్థాయిలో నడిచే పరిస్థితి లేకపోవడం, ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతుండటంతో ‘టెనెట్’కు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇంకొన్ని నెలలు ఆగి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక సినిమాను రిలీజ్ చేయాల్సిందని అంటున్నారు. ఎలాగూ సినిమా రిలీజైపోయిన నేపథ్యంలో పైరసీ ప్రింట్లు బయటికొచ్చేస్తాయి. తర్వాతి నెలల్లో థియేటర్లు తెరుచుకున్న ప్రాంతాల్లో సినిమాను రిలీజ్ చేసినా వసూళ్లపై ప్రభావం ఉంటుంది. మొత్తంగా చూస్తే కరోనా పుణ్యమా అని ‘టెనెట్’ వేల కోట్లలోనే నష్టపోయిందని స్పష్టమవుతోంది.