మహాప్రభో.. థియేటర్లు తెరవండి

లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయకముందే, కరోనా విజృంభణ కొనసాగుతుండగానే కొన్ని నెలల కిందటే వైన్ షాపులు తెరుచుకోవడానికి అనుమతులిచ్చేసింది ప్రభుత్వం. ఆ సందర్భంగా మద్యం దుకాణాల ముందు జనాలు వందల సంఖ్యలో ఎలా నిలబడ్డారో.. ఒకరి మీద ఒకరు పడి ఎలా తోసుకున్నారో అందరూ చూశారు. రోజులు గడిచేకొద్దీ అన్ని చోట్లా షరతులు తొలగిపోయాయి.

జనాలు ఏ పరిమితులూ లేకుండా తిరిగేస్తున్నారు. మార్కెట్లకు పోతున్నారు. షాపింగులు చేస్తున్నారు. విహారాలకు వెళ్తున్నారు. ఇలా అన్నింటికీ అనుమతులు వచ్చాయి. అన్ని చోట్లా జనాలు కనిపిస్తున్నారు. కానీ థియేటర్లకు మాత్రం ఎంతకీ మోక్షం కలగట్లేదు. ఇంతమందిని కరుణించి మాపై మాత్రం ఎందుకీ వివక్ష అని థియేటర్ ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్లు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు ప్రభుత్వం.

ఒక షాపింగ్ మాల్‌లో కింద వందల మంది జనాలు తిరుగుతూ ఉండి.. పైగా థియేటర్లు మాత్రం మూత వేసి ఉండటం విడ్డూరమే. నియంత్రిస్తే అన్నింటినీ నియంత్రించాలి. కానీ ఇలా థియేటర్లను మాత్రం కట్టడి చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పరిశ్రమను నమ్ముకున్న లక్షలాది మంది ఆరు నెలలకు పైగా ఆదాయం లేక పస్తులుంటున్నారు. తాజాగా ప్రసాద్ ఐమాక్స్ లాంటి పేరున్న సంస్థలో థియేటర్ ఆపరేటర్‌గా పని చేసే వ్యక్తి జీతం రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి సింగిల్ స్క్రీన్లను నమ్ముకున్న లక్షలాది మంది పరిస్థితి ఏంటి?

థియేటర్లను తెరిచినా వెంటనే జనం ఎగబడే పరిస్థితి ఎంతమాత్రం లేదు. సోషల్ డిస్టెన్సింగ్‌తో సీటింగ్ ఏర్పాటు చేయడం అనివార్యం. ఇతర నిబంధనలు కూడా పాటించాల్సిందే. కాబట్టి పూర్తి స్థాయిలో ఆదాయం రాదు. కనీసం మెయింటైనెన్స్ ఖర్చులైనా వచ్చి.. థియేటర్లలో పని చేసే సిబ్బంది కడుపులైనా నిండుతాయి. ఎంత పెద్ద సంస్థ అయినా ఎన్ని నెలలని ఆదాయం లేకుండా చేతి నుంచి జీతాలు ఇస్తుంది? ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్రం కరుణించి థియేటర్లకు మోక్షం కల్పించాలని వాటిని నమ్ముకున్న అభాగ్యులు అభ్యర్థిస్తున్నారు.