డీజీపీ సవాంగ్ రాజీనామా చేయాలి….హైకోర్టు షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ పై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి అదృశ్యం కేసులో సవాంగ్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ సవాంగ్ రాజీనామా చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందని, ఏపీలో ‘రూల్ ఆఫ్ లా’ అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఏపీ డీజీపీని పలుమార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని, ప్రతిసారి ఇలా జరిగితే ప్రభుత్వానికి ఇబ్బంది అని వ్యాఖ్యానించింది. ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. కాగా, ఈ నేపథ్యంలో అతడి మేనమామ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తీవ్ర అసహనానికి లోనైంది. వెంకటరాజు అదృశ్యం కేసులో పోలీసుల తీరును తప్పుబట్టింది. గతంలో మూడు సార్లు జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది.

కాగా, గతంలోనూ సవాంగ్ పలుమార్లు హైకోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఓ దంపతులకు సంబంధించి హెబియస్‌కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా సవాంగ్ తొలిసారి హైకోర్టులో హాజరయ్యారు. విశాఖపట్టణంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన వ్యవహారం నేపథ్యంలో రెండోసారి కోర్టు మెట్లెక్కారు. చంద్రబాబుకు స్థానిక పోలీసులు ఇచ్చిన నోటీసులపై వివరణ కోరుతూ డీజీపీ కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఆ వ్యవహారంలో సుమారు ఆరున్నర గంటలపాటు సవాంగ్ కోర్టులో వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్రమ మద్యం తరలింపు వ్యవహారంలో పట్టుబడిన వాహనాల అప్పగింత వ్యవహారంలో సవాంగ్ మూడోసారి హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ వాహనాల అప్పగింతలో పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంలో పోలీసులు సరైన వివరణ ఇవ్వకపోవడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టులో హాజరయ్యారు.