ఎవరీ ఓం ప్రతాప్.. చిత్తూరు జిల్లాలో అసలేం జరుగుతోంది?

చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ అలజడి ఇప్పుడు అంతకంతకూ పెరుగుతోంది. రాజకీయంగా అధికార.. విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంతకూ అసలేం జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెందిన ఓం ప్రతాప్ అనే దళితుడు.. ఒక వీడియోను పోస్టు చేశాడు. అందులో.. రూ.140 ఉన్న బీరును రూ.260 పెంచటం ఏమిటంటూ జగన్ సర్కారు మీద ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు శ్రుతిమించి ఉండటంతో పాటు.. తాగి ఉండటం కారణం కావొచ్చు.. అసభ్యకర పదజాలాన్ని వాడాడు.

ఎన్నికల వేళలో తాను కూడా జగన్ కు ఓటేశానని.. జగన్ గెలుపు కోసం లక్షలు ఖర్చు పెట్టానని.. అలా అని.. మద్యం ధరల్ని ఇంతలా పెంచుతారా? అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాతో పాటు.. వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. సీఎం జగన్మోహన్ రెడ్డి మీదా.. ఆయన అనుసరిస్తున్న మద్యం పాలసీ మీద ఒక సామాన్యుడు నోటికి వచ్చినట్లుగా తిట్ట దండకాన్ని వల్లించటం నచ్చని జగన్ పార్టీ నేతలు రంగంలోకి దిగినట్లు చెబుతారు.

ప్రభుత్వాధినేతపైనే నోటికి వచ్చినట్లు మాట్లాడతావా? అంటూ బెదిరింపులకు పాల్పడినట్లుగా సమాచారం. తాను చేసిన వీడియోకు ఊహించని రీతిలో ఎదురవుతున్న హెచ్చరికలకు హడలిపోయిన ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. విషయం మరో టర్న్ తీసుకుంది. మద్యం పాలసీపై ప్రభుత్వాన్ని నిలదీయటం తప్పా? నిజమే.. నోరు జారాడు.. అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశాడు. అలాంటప్పుడు హెచ్చరించాలి.. చట్టప్రకారం శిక్షలు వేయాలే తప్పించి.. ఇలా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తారా?అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు అతను ఆత్మహత్య చేసుకోలేదు.. అధికార పార్టీకి చెందిన వారే బెదిరింపులకు దిగి.. చంపేశారన్న ఆరోపణలు చేస్తున్నారు. ‘మీ మాఫియాను ప్రశ్నిస్తే చంపేస్తారా?’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి. దళిత యువకుడి మరణానికి కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి.. ఎంపీ రెడ్డప్ప.. వారి అనుచరులు కాదా? అని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

మరణించిన ఓం ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డితో పాటు.. పలువురు టీడీపీ నేతలు వారి గ్రామానికి బయలుదేరగా పోలీసులు అడ్డుకోవటం ఇప్పుడు వివాదంగా మారింది. మరణించిన వ్యక్తి ఇంటికి వెళ్లటంపైనా పరిమితులు ఏమిటి? అన్న ప్రశ్నను టీడీపీ సంధిస్తోంది.

ఓం ప్రతాప్ మృతికి కారణమైన వైసీపీ నాయకులను అరెస్ట్ చేయాలని, మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించాలని కోరటం తప్పా? అని ప్రశ్నిస్తున్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను గృహ నిర్బంధం చెయ్యాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు. పరామర్శకు అనుమతించకపోవటం ఏమిటని పలువురు తప్పు పడుతున్నారు.