200 కోట్ల సినిమా ఓటీటీలో రిలీజా.. హహహ

లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పుడంతా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌దే హవా. టీవీల్లో ఎప్పుడూ పాత సినిమాలే వస్తుంటాయి. సీరియళ్లు, వేరే ప్రోగ్రామ్స్ కూడా ఆగిపోయాయి. పాతవే రీటెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో ఓటీటీల్లోకి వెళ్లి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసి ఆస్వాదిస్తున్నారు ప్రేక్షకులు. బహు భాషల్లో కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు లాగించేస్తున్నారు.

ఐతే లాక్ డౌన్ కొనసాగుతుండటం.. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో వాటికి కంటెంట్ ఇంకా చాలా అవసరమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. దీంతో థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలకు కొంచెం ఎక్కువ రేటు పెట్టి కొనాలని చూస్తున్నాయి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. ఐతే థియేటర్లలో పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం లేని చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు డీల్స్ తెగొచ్చేమో కానీ.. పెద్ద సినిమాలు నేరుగా ఓటీటీల్లోకి వెళ్లే అవకాశం అయితే కనిపించడం లేదు.

తెలుగులో ‘వి’; ‘రెడ్’ లాంటి సినిమాల్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసే అవకాశమే లేదని ఆ చిత్రాల రూపకర్తలు చెప్పేశారు. అలాంటిది హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’; ‘లక్ష్మీబాంబ్’ లాంటి సినిమాల్ని ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.

ముందుగా ‘కాంఛన’ రీమేక్ ‘లక్ష్మీబాంబ్’ ఓటీటీలో రిలీజవుతుందంటూ ఓ ప్రచారం నడుస్తోంది. దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవెల్లో ట్రెండ్ అవుతోంది. ఐతే అక్షయ్ కుమార్, ఆయన సినిమాల రేంజ్ ఏంటో తెలియని వాళ్లే ఈ ప్రచారాలు సాగిస్తున్నారన్నది స్పష్టం.

అక్షయ్ సినిమాకు హిట్ టాక్ వస్తే రూ.200 కోట్ల దాకా వసూళ్లు వస్తాయి. ‘సూర్యవంశీ’, ‘లక్ష్మీబాంబ్’.. ఈ రెండు సినిమాల మీదా అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా మార్చిలో విడుదల కావాల్సిన ‘సూర్యవంశీ’కి బంపర్ క్రేజ్ వచ్చింది.

అక్షయ్‌తో పాటు అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్ కూడా ఇందులో నటించడం, రోహిత్ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమా తీయడంతో అంచనాలు మామూలుగా లేవు. సినిమా అంచనాలకు తగ్గట్లుంటే 200 కోట్లేంటి దానికి డబుల్ వసూలు చేయొచ్చు. అలాంటి సినిమాను ఓటీటీల్లో రిలీజ్ చేస్తారని ఎలా అనుకుంటారు? అవి మహా అయితే రూ.100 కోట్ల రేటిస్తే ఎక్కువ. కాబట్టి ఇలాంటి ప్రచారాలు ఇక కట్టి పెడితే బెటర్.