అమరావతి: సీఎంతో పాటు, కేబినెట్ కి, బీజేపీ టీడీపీలకు నోటీసులు

అమరావతి రైతులు రాజధాని పరిరక్షణ కోసం ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు వ్యూహాత్మకంగా చట్టం అండగా పోరాడుతున్నారు. రైతుల్లో ఎక్కువమంది చట్టాలు, హక్కులపై అవగాహన ఉన్నవారే కావడంతో ప్రభుత్వాన్ని సులువుగా ఇరుకున పెట్టగలుగుతున్నారు.

తాజాగా ఒక అనూహ్యమైన పిటిషను కొత్తకోణంలో హైకోర్టులో దాఖలైంది. ప్రభుత్వం రాజధాని తరలించడానికి దురుద్దేశపూరితమైన చట్టాలను చేసిందని, ఇందులో రాజకీయ పార్టీలు కూడా భాగస్వాములు అయ్యాయని పేర్కొంటూ కొందరు అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని విచారించిన హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. దీనికి కారణం… రైతులు వివిధ సందర్భాల్లో ఆయా రాజకీయ పార్టీలు చేసిన వ్యాఖ్యానాలను జోడించడమే. వాటిని పరగణలోకి తీసుకున్న హైకోర్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రివర్గం, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ప్రతిపక్షంలో, అధికారంలో ఉన్నపుడు ఆయా పార్టీలు చేసిన విరుద్దమైన వ్యాఖ్యాలను కోర్టు తీవ్రంగా తీసుకుంది.

రాజధాని అంశంపై దాఖలైన అనేక పిటిషన్లు గురువారం విచారణకు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. అంతవరకు స్టే విధించి.. మొత్తం పిటిషన్లను అధ్యయం చేసి 21 నుంచి రోజు వారి విచారణ చేయనున్నారు. ఇదిలా ఉండగా… అత్యధిక పిటిషన్లు దాఖలు కావడంతో అమరావతి కేసును హైకోర్టు ప్రత్యేకంగా పరిగణిస్తోంది. ఈ అంశంపై రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మొత్తం 70 పిటిషన్లు నమోదు చేయడం గమనార్హం.