‘స్వచ్ఛ సర్వేక్షణ్-2020’ టాప్-10లో 3 ఏపీలోనివే

2014లో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ‘స్వచ్ఛ భారత్’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. పరిసరాల శుభ్రతపై అవగాహన పెంచుతూ మోదీ చేపట్టిన బృహత్తర కార్యక్రమం….దేశంలోని మెట్రో నగరాలు, పట్టణాలతోపాటు, పల్లెలకూ వ్యాపించింది.

ఈ క్రమంలోనే దేశంలోని నగరాల మధ్య స్వచ్ఛతలో పోటీతత్వం పెంపొందించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ సర్వేను ప్రతి ఏటా‌ మినిస్ట్రీ ఆఫ్ హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్‌ (ఎంవోయూహెచ్ఏ) నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్-2020’జాబితాలో ఇండోర్ నగరం తొలి స్థానం దక్కించుకుంది.

మధ్యప్రదేశ్ రాజధాని అయిన ఇండోర్ వరుసగా నాలుగోసారి క్లీనెస్ట్‌ సిటీగా నిలవడం విశేషం. జాతీయవ్యాప్తంగా శుభ్రత విషయంలో నిర్వహించిన సర్వేలో క్లీనెస్ట్‌ సిటీగా ఇండోర్‌ నిలిచిందని ‘స్వచ్ఛ మహోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఈ సర్వేలో సూరత్‌ రెండో క్లీనెస్ట్ సిటీగా నిలవగా, నవీ ముంబై మూడో స్థానం దక్కించుకుందని ఆయన ప్రకటించారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నాలుగో స్థానం దక్కించుకుందని తెలిపారు.

ఇండోర్ పరిశుభ్రమైన నగరంగా నిలవడం ఇది వరుసగా నాలుగోసారి అని, పరిశుభ్రత విషయంలో అక్కడి ప్రజలు చాలా అంకిత భావం చూపారని హర్దీప్ పూరీ అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌కు, ప్రజలకు, మున్సిపల్ కార్పొరేషన్‌కు అభినందనలు తెలిపారు. సూరత్ రెండో స్థానంలో నిలిచినందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కూడా పూరీ అభినందనలు తెలిపారు.

అయితే, మూడో క్లీనెస్ట్ సిటీగా నిలిచిన ముంబైకి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేరును కూడా పూరీ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ జాబితాలోని టాప్-10లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి న‌గ‌రాలు కూడా చోటు ద‌క్కించుకున్నాయి. కాగా, గంగా నది ఒడ్డులో స్వచ్ఛ పట్టణంగా వారణాసి ఎంపికైంది. అలాగే జలంధర్ కంట్ క్లీనెస్ట్‌ కంటోన్మెంట్‌గా నిలిచింది. ఈ సర్వేలో 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, గంగా నదీ పరివాహక టౌన్లతో కలిపి 92 పట్టణాలకు చెందిన 1.87 కోట్ల మంది పౌరులు పాల్గొన్నారు.