బాలు ఆరోగ్యంపై కాస్త కంగారే..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషయంలో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కోట్లాది మందిని తన పాటలతో దశాబ్దాలుగా అలరిస్తున్న ఈ గాన గంధర్వుడు.. ఈ నెల తొలి వారంలో కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల కిందట ఆయన పరిస్థితి కొంచెం విషమించింది. వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక దశలో ఆయన ఆరోగ్యం చాలా విషమించిందని.. ఆయన మృత్యువుతో పోరాడుతున్నాడని వార్తలొచ్చాయి. అప్పుడు అందరూ శోకంలో మునిగిపోయారు. ఐతే తర్వాత కొంచెం కోలుకున్నారని.. బాలు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని.. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని అప్ డేట్లు ఇచ్చారు ఆయన కుటుంబ సభ్యులు. నిన్న మెగాస్టార్ చిరంజీవి సైతం బాలు ఆరోగ్యం కుదుటపడాలంటూ ఓ వీడియో చేశారు. అందులో బాలు కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెప్పినట్లు వెల్లడించారు.

ఐతే బాలు తొలిసారి వెంటిలేటర్ మీదికి వెళ్లినపుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ రిలీజ్ చేసిన ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు.. ఆ తర్వాత అధికారిక అప్ డేట్ ఇవ్వలేదు. కాగా బుధవారం ఆసుపత్రి వాళ్లు మళ్లీ బులిటెన్ రిలీజ్ చేశారు. అందులో పేర్కొన్న విషయం చూస్తే బాలు పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని స్పష్టమవుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పూ లేదని.. విషమంగానే ఉందని ఇందులో పేర్కొన్నారు. బాలుకు వెంటిలేటర్ తొలగించినట్లు వస్తున్న వార్తల్ని ఆసుపత్రి యాజమాన్యం ఖండించింది. స్పెషల్ ఐసీయూలో ఉంచి 12 మంది వైద్యుల బృందం బాలుకు చికిత్స అందిస్తోంది. వెంటిలేటర్ కొనసాగించాల్సి వస్తుండటాన్ని బట్టి బాలు పరిస్థితి ఏమంత మెరుగుపడట్లేదని స్పష్టమవుతోంది. కాకపోతే మరీ విషమించి ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి లేదని తెలుస్తోంది. కానీ చికిత్స అందుతుండగా.. కొన్ని రోజులు గడిచాక ఆయన పరిస్థితి మెరుగుపడకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.