మొన్న కోటి.. ఇప్పుడు రూ.50 లక్షలు..పరిహారంతో సరా?

పోయిన ప్రాణానికి నిమిషాల్లో వెల కట్టే కొత్త సంప్రదాయం ఈ మధ్యన పెరుగుతోంది. ప్రాణం పోవటానికి కారణాలు తెలుసుకునే కన్నా.. ఫలానా ఉదంతం జరిగింది.. బాధితులు ఎంతమంది? సరే.. ఇంత పరిహారం ఇచ్చేద్దామని డిసైడ్ కావటం.. దానికి సంబంధించిన ప్రకటన చేయటం ఈ మధ్యన రివాజుగా మారుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు బాధితులకు పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించటం మామూలే.

కాకపోతే మారిన కాలానికి తగ్గట్లు ప్రభుత్వం ప్రమాదానికి కారణం.. బాధ్యుల్ని తెలుసుకోవటం.. బాధితులకు అందాల్సిన సాయం కంటే కూడా పరిహారాన్ని చాలా వేగంగా ప్రకటిస్తున్న వైనం చూస్తే.. విస్మయానికి గురి కావాల్సిందే. తాజాగా బెజవాడ కోవిడ్ సెంటర్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం విషయానికే వస్తే.. ఇప్పటివరకూ ఆ ఘటనలో తొమ్మిది మంది మరణించినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికి అగ్నిప్రమాదానికి సంబంధించిన మంటల తాలుకూ పొగ ఇంకా ఆరలేదు. అగ్నిప్రమాదంలో చిక్కుకుపోయి ప్రాణాలు విడిచిన వారిని పూర్తిగా బయటకు తీసుకురాలేదు. కానీ.. మరణించిన వారికి రూ.50లక్షల రూపాయిల పరిహారాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది. భారీ మొత్తంలో పరిహారాన్ని ప్రభుత్వాలుప్రకటించటానికి మేం వ్యతిరేకం కాదు. కాకుంటే.. దానికో విధివిధానం అన్నట్లు ఉండాలన్నదే ప్రశ్న.

మొన్నటికి మొన్న విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ సందర్భంగా మరణించిన వారికి కోటి రూపాయిలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే నగరంలో భారీ క్రేజ్ విరిగిపోయి మరణించిన వారికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారానికి.. తాజాగా బెజవాడలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ప్రాణాలు విడిచిన వారికి ప్రకటించిన పరిహారానికి పోలిక లేకపోవటం ఏమిటి? ప్రమాదం ఏదైనా పోయేది ప్రాణమే. అలాంటప్పుడు ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఎందుకు? దీని లాజిక్కేమిటి?దీని లెక్కేమిటి జగన్ సార్?