రూ.500 నోటు కంటే రూ.200 నోటుకే ఎక్కువ ఖర్చా?

ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సమాచార హక్కు చట్టం కింద భారత రిజర్వు బ్యాంకును జలగం సుధీర్ అనే పెద్ద మనిషి తన బుర్రలో ఉన్న సందేహాల్ని ఒక పేపర్ మీద రాసేసి పంపారు? కరెన్సీ నోట్లకు సంబంధించిన సమాచారం తెలసుకునేలా ఆయన అడిగిన ప్రశ్నలకు.. భారత రిజర్వు బ్యాంకు తాజాగా సమాధానాలు ఇచ్చింది. అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వటమే తప్పించి? కారణాల్ని వివరించటం లాంటివి చేయాలన్న రూల్ లేకపోవటంతో.. మీరు అడిగారు.. మేం చెప్పేశామన్న తరహాలో సమాధానాల్ని ఇచ్చేసింది.

ఈ సమాధాలన్నింటిలోనూ ఒక అంశం దగ్గరకు వచ్చేసరికి మాత్రం.. మరిన్ని సందేహాలు కలిగేలా చేసింది. సాధారణంగా ఒక పెద్ద నోటు తయారు చేయటానికి ఎక్కువ ఖర్చు అవుతుందా? దాని కంటే కాస్త చిన్న నోటు ప్రింట్ చేయటానికి ఎక్కువ ఖర్చు అవుతుందా? అన్న ప్రశ్న వేస్తే.. ఎవరైనా పెద్ద నోటుకే ఎక్కువ ఖర్చు అవుతుందని చెబుతారు. అయితే.. ఆ సమాధానం తప్పన్న విషయాన్ని తాజాగా వెల్లడించింది రిజర్వు బ్యాంకు.

దేశంలో అధికంగా ముద్రించే రూ.500 నోటు కంటే దాని కంటే చిన్నదైన రూ.200 నోటు కోసమే ఎక్కువగా ఖర్చు అవుతుందని తాజాగా వెల్లడించారు. అదే సమయంలో.. ఏ కరెన్సీ నోటును ముద్రించేందుకు ఎంత ఖర్చు అవుతుందన్న సమాచారాన్ని వెల్లడించారు. దీని ప్రకారం.. రూ.500 నోటును ప్రింట్ చేయటానికి ఒక్కో నోటుకు రూ.2.13 ఖర్చు అయితే.. రూ.200 నోటు ముద్రణకు మాత్రం రూ.2.15 చొప్పున ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో వంద నోటుకు రూ.1.34 చొప్పున ఖర్చు అవుతుందని.. రూ.50 నోటుకు 82పైసలు ఖర్చు చేస్తామన్నారు.

యాభై రూపాయిల కంటే కూడా రూ.20 నోటుకు కాస్త ఎక్కువ ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఒక్కో రూ.20 నోటు ముద్రణకు 85 పైసలు చొప్పున ఖర్చు అవుతుందని వెల్లడించారు. అతి తక్కువ ప్రింటింగ్ ఖర్చుపది రూపాయిల నోటుకు అవుతుందని.. ఒక్కో నోటుకు డెబ్భైఐదు పైసలు చొప్పున ఖర్చు అవుతుందని లెక్క కట్టారు.

లెక్క అంతా బాగానే ఉంది కానీ..రూ.2వేల నోటు ముద్రణ కోసం ఎంత ఖర్చు అవుతుందన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. మేం ఈ ఏడాది రూ.2వేల నోట్లనుముద్రించలేదు కాబట్టి.. దాని ఖర్చు లెక్క మేం చెప్పమని తేల్చేశారు. అంతా బాగానే ఉంది కానీ రూ.500 నోటు కంటే రూ.200 నోటుకు ఎక్కువ ఖర్చు అవుతుందన్న విషయాన్ని రిజర్వు బ్యాంకు చెప్పలేదు. మరోసారి జలగం మాష్టారు పూనుకొని అడిగితే ఏమైనా ఆసక్తికరమైన విషయం రావొచ్చేమో?