చంద్రబాబు స్పీక్స్… అమరావతి పోరు కొనసాగిస్తాం

ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతి రాజధానిని కేవలం శాసన రాజధానికి పరిమితం చేస్తూ విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూల్లో జ్యూడిషియల్ కేపిటల్ ను ఏర్పాటు చేస్తూ జగన్ సర్కారు చేసిన ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీనిపై టీడీపీ భగ్గుమంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచే జూమ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు… మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదంపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కలగా ఉన్న రాజధాని అమరావతిని చంపేస్తూ మూడు రాజధానులు అంటూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించేది లేదని, అమరావతి జేఏసీతో కలిసి పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు.

ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు ఏమన్నారన్న విషయానికి వస్తే.. ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ఏకైక రాజధానే ఉండాలి. అలా కాదని రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ జగన్ సర్కారు అడుగు వేయడం రాజ్యాంగ విరుద్ధమే. రాజధాని కూడా లేకుండా ఏర్పడిన నవ్యాంధ్రకు అమరావతిలో రాజధానిని నిర్మిస్తామన్న మా ప్రభుత్వ ప్రతిపాదనకు ఆ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేలాది ఎకరాల భూములు ఇచ్చారు. రాజధానిగా అమరావతిని విపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… ప్రజల రాజధాని కలను చిదిమేసి మూడు రాజధానులు అంటూ మడమ తిప్పారు. ఇదెంత వరకు న్యాయం. రాష్ట్రంలో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తోంటే.. జగన్ సర్కారు గవర్నర్ చేత మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేయించి రాష్ట్రంలో రాజధాని చిచ్చు రేపింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రోజుల తరబడి ఉద్యమం సాగిస్తున్న అమరావతి జేఏసీకి మద్దతుగా భవిష్యత్తులోనూ ఉద్యమం కొనసాగిస్తాం’’ అని చంద్రబాబు పేపర్కొన్నారు.

వైసీపీ అధికారంలోకి రాగానే… అమరావతిని చంపేసేందుకు వ్యూాహాత్మకంగా పావులు కదిపారని చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగా అమరావతిలో రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవసరమవుతుందని తప్పుడు ప్రకటనలు గుప్పించారని ఆయన విరుచుకుపడ్డారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధికి మరో రూ.10 వేల కోట్లను జోడిస్తే… అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి అయ్యి ఉండేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అనైతిక పాలనపై చర్యలు తీసుకోవాలని కోరితే స్పందించని గవర్నర్.. జగన్ సర్కారు ప్రతిపాదించిన వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపారని చంద్రబాబు మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, అయితే అధికారిక వికేంద్రీకరణకు మాత్రమే తాము వ్యతిరేకమని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలోని ఏ ఒక్క రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు లేవని, ఈ నేపథ్యంలో మూడు రాజధానులతో ప్రయాణం మొదలెట్టనున్న ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు.