ఓటీటీ రిలీజ్.. ఇదో కొత్త స్ట్రాటజీ

Uma

ఒక కొత్త సినిమా విడుదలవుతుంటే.. చిత్ర బృందం ఎంత హడావుడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ సినిమాకైనా ప్రమోషన్ చాలా కీలకంగా మారిపోయిన ఈ రోజుల్లో కనీసం నెల రోజుల ముందే విడుదల తేదీ ఖరారు చేసి.. ఆ డేట్‌ను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇక విడుదల దగ్గర పడే సమయానికి ప్రచార హోరు ఇంకా పెరుగుతుంది.

సోషల్ మీడియా ద్వారా కౌంట్ డౌన్లు నడుపుతూ జనాల్ని తమ సినిమా వైపు ఆకర్షించే ప్రయత్నం జరుగుతుంది. చిన్న సినిమాల విషయంలో ఈ రకమైన ప్రమోషన్ మరీ అవసరం. కానీ ఇప్పుడు ఈ హంగామా ఏమీ కనిపించడం లేదు. థియేటర్లు మూతపడి.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రమోషన్ గురించి అసలేమాత్రం పట్టించుకోవడం లేదు మేకర్స్.

ఓటీటీతో డీల్ ముగియగానే.. ప్రచారాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఏదో నామమాత్రంగా ట్విట్టర్లో కొన్ని అప్ డేట్లు ఇచ్చి వదిలేస్తున్నారు. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గత నెలలో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్’ లీల విషయంలో ఇలాగే చేశారు. ఇప్పుడు ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’కూ అంతే. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాల నిర్మాతలు కనీసం వీటి రిలీజ్ డేట్లను అధికారికంగా ప్రకటించలేదు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ను అయితే చడీచప్పుడు లేకుండా రిలీజ్ చేసి పడేశారు.

రాత్రి అనుకోకుండా ట్విట్టర్లో ఉండి సినిమా రిలీజ్ గురించి తెలిసి, చూసి పొద్దునకు ట్వీట్లు వేస్తే కానీ జనాలకు విషయం తెలియలేదు. ‘ఉమామహేశ్వర..’కు ఇలాగే జరిగింది. దీని రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటనే లేదు. జులై 15 అని.. ఆ తర్వాత 31 అని వార్తలొచ్చాయి. తీరా చూస్తే 29న అర్ధరాత్రి సినిమాను నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేశారు.

థియేటర్లలో రిలీజ్ చేసినప్పట్లా ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రమోషన్లు లేకుండా.. పబ్లిసిటీకి పైసా కూడా ఖర్చు చేయకుండా.. సినిమా విడుదల గురించి ఒక యాడ్ కూడా ఇవ్వకుండా సైలెంటుగా ఉంటున్నారు. సినిమాను అమ్మేశాం కాబట్టి సోషల్ మీడియాలో టాక్ చూసి.. ఓటీటీల్లో చూసేవాళ్లు చూడనీ అన్నట్లుగా ఉంది నిర్మాతల వ్యవహారం.