బాక్సాఫీస్‌లో సునామీ చూడాల్సిన రోజిది

2020 జులై 30.. అంటే ఈ రోజే. అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఇండియన్ బాక్సాఫీస్ బద్దల్వాల్సిన రోజిది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఈ రోజు అందరూ ఓ సినిమా గురించి మాట్లాడుకోవాల్సింది. అన్ని రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం కనిపించాల్సింది. టికెట్ల కోసం ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో ప్రేక్షకులు కొట్టుకుంటుండాల్సింది. పెద్ద పెద్ద వాళ్లతో పైరవీలు చేస్తూ ఉండాల్సింది.

సోషల్ మీడియాలో చర్చంతా ఒక సినిమా గురించే నడుస్తుండాల్సింది. ట్రేడ్ అనలిస్టులు బుకింగ్స్ గురించి.. థియేటర్ల దగ్గర పరిస్థితి గురించి.. కలెక్షన్ల ప్రభంజనం గురించి ట్వీట్లు వేస్తుండాల్సింది. మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా గురించి మాట్లాడుకుంటూ ఉండాల్సింది. కానీ ఏం చేద్దాం.. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.

‘బాహుబలి’ తర్వాత మన దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’కు ముందు రిలీజ్ చేయాలనుకున్న డేట్.. 2020 జులై 30. ఈ విషయాన్ని గత ఏడాది మార్చిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించాడు. ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్న విలేకరులు నిజంగా ఆ తేదీకి సినిమా వస్తుందా అని విలేకరులు అడిగేశారంటే జక్కన్నపై ఉన్న ‘భరోసా’ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అయితే జులై 30 కాకపోయినా 2020 మాత్రం దాటనివ్వనంటూ నొక్కి వక్కాణించాడు రాజమౌళి. కానీ జక్కన్న సినిమా అంటే షూటింగ్ ఆలస్యం కావడం.. రిలీజ్ డేట్ మారడం అనివార్యం. అదే జరిగింది. ఈ సినిమాను 2021కి తీసుకెళ్లిపోయారు. వచ్చే ఏడాది జనవరి 8 అంటూ కొత్త డేట్ ఇచ్చారు. కానీ కరోనా దెబ్బకు ఆ డేట్‌ను కూడా అందుకునే పరిస్థితి లేకపోయింది. చిత్రీకరణ ఎప్పుడు పున:ప్రారంభం అవుతుందో.. సినిమా ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పలేని పరిస్థితి. ఐతే అన్నీ కలిసొస్తే వచ్చే ఏడాది జులై 30న సినిమా రిలీజవుతుందేమో చూడాలి.