జగన్ కు ఒళ్లు మండేలా చేసిన రఘురామ రాజు

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా ఉంది నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారమంతా. ఎంతైనా జగన్ స్కూల్ కదా? ఒకసారి టార్గెట్ చేసిన తర్వాత.. మాటలతో.. చేతలతో చుక్కలు చూపించే సరికొత్త తీరును ఆయనిప్పుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఏపీ సీఎం జగన్ ఎలాంటి ఎత్తులు వేస్తారో.. సరిగ్గా అలానే వ్యవహరిస్తూ ఆసక్తికరంగా మారారు.

బీజేపీ అధినాయకత్వానికి దగ్గరగా.. ప్రధాని మోడీకి.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన అమిత్ షాకు ఆప్తుడిగా వ్యవహరించే రఘురామ.. ఇటీవల కాలంలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సొంత పార్టీకే షాకులు ఇచ్చే నేతలు మామూలే అయినా.. రఘురామ వ్యవహారం మరికాస్త కొత్తగా ఉంది. జగన్ రాజకీయ సాఫ్ట్ వేర్ నుంచి వచ్చి ఉండటంతో.. ఊహించని రీతిలో ఉక్కిరిబిక్కిరి చేయటంలో ఆయన ముందుంటున్నారు.

పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేయటంలో ముందున్న ఆయనకు పార్టీ నోటీసులు పంపితే.. అసలు నోటీసులు పంపి తప్పు చేశామా? అన్న భావన పార్టీ అధినాయకత్వానికి కలిగేలా చేశారు రఘురామ. ఆ తర్వాతి కాలంలో వరుస పెట్టి చేస్తున్న వ్యాఖ్యలు.. తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీ నేతలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారే తప్పించి.. ఆయనపై ప్రతిదాడికి సాహసించని పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది.

దీనికి తగ్గట్లే తాజాగా చోటు చేసుకున్న పరిణామాన్ని చెప్పాలి. సాధారణంగా ఎక్కడైనా ఒక ఎంపీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పెద్ద ఎత్తు పనులు నిర్వహిస్తున్నప్పుడు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చేత కానీ..కుదరకుంటే రాష్ట్ర మంత్రిని ముఖ్య అతిధిగా పిలుస్తుంటారు. అందుకు భిన్నంగా రఘురామ మాత్రం తన నియోజకవర్గంలోని పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆహ్వానం పంపారు.

నర్సాపురం అసెంబ్లీ పరిధిలోని మైనపువాని లంకలో నిర్మించిన భవనాల ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రిని పిలవటం సంచలనంగా మారింది. అంతేకాదు.. విపత్తు నిర్వహణ నిధుల నుంచి కోతకు గురి అవుతున్న తీర ప్రాంతంలో రివిట్ మెంట్ పనులకు రూ.200 కోట్లు కేటాయించాలని కోరుతున్నారు. సాధారణంగా ఇలాంటి పనులు చేస్తే విమర్శలు తప్పవు. పార్టీ నుంచి ఇబ్బందులు తప్పవు. ఇక్కడ ట్విస్టు ఏమంటే.. నిర్మలాసీతారామన్ దత్తత తీసుకున్న గ్రామంలోనే ఈ పనులు పూర్తి చేయటం.. ఆమెనే ముఖ్య అతిధిగా ఆహ్వానించటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కత్తులు నూరుతున్నారే తప్పించి.. ఏమీ అనలేని పరిస్థితి నెలకొందట.