రాజమండ్రి బాలిక ఇక టీడీపీ బిడ్డ… మేమే చదివిస్తాం- చంద్రబాబు

రాజకీయం తెలియకనే మూడు సార్లు ముఖ్యమంత్రి కావడం అన్నది సాధ్యం కాదు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చంద్రబాబును బలహీన పరచడానికి ఎప్పటికపుడు ఇక చంద్రబాబుకు రిటైర్ మెంటే అన్నట్లు ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని తన చేతలతో చంద్రబాబు పటాపంచలు చేస్తున్నారు. తానింకా ఫుల్ ఫాంలో ఉన్నట్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల వర్చువల్ గా మహానాడు నిర్వహించి ఇంటర్నెట్ తోనే వైసీపీకి షాక్ ఇచ్చిన చంద్రబాబు తాజాగా రాజమండ్రి బాలిక రేప్ కేసులో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు.

రాజమండ్రిలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వం అసమర్థత అంటూ ఏకిపారేశాడు. అంతేకాదు తాజాగా ఆ బాలిక కు పార్టీ తరఫున 2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు చంద్రబాబు. ఘటనపై పార్టీ తరఫున నిజనిర్ధారణ కమిటీ వేసి నివేదిక తెప్పించుకున్నారు. కమిటీ సభ్యులు నిన్న రాజమండ్రికి వెళ్లి బాధితురాలని పరామర్శించారు. సకల వివరాతో నివేదికను చంద్రబాబుకు అందించారు. వెంటనే చంద్రబాబు ఆ నివేదిక మేరకు తక్షణ సాయం కింద నగదు సాయం ప్రకటించారు.

ఈ సందర్భంగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. శాశ్వతంగా ఆ పాప బాధ్యత తెలుగుదేశం పార్టీదే అన్నారు. బాలిక పదో తరగతి వరకు చదువుకుందని, ఇక ఆ అమ్మాయిని పార్టీ తరఫున చదివిస్తామన్నారు. తనకు టీడీపీ అండగా ఉంటుందనే భరోసాను కలిగించాలని చెబుతూ ‘‘ఇలాంటి దుర్మార్గాలపై పోరాడే వీరవనితగా ఆమెను తీర్చిదిద్దాలని‘‘ సంచలన వ్యాఖ్య చేశారు.

చంద్రబాబు తాజా నిర్ణయం… స్థానికంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. వేగంగా పార్టీ ఈ ఘటనలో రియాక్టైన తీరు పార్టీ పై చాలా సానుకూల ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.