అభిషేక్ బచ్చన్‌ ఎంత మంది దర్శకులను బతిమాలుకున్నా..

మిగతా ఫిలిం ఇండస్ట్రీల్లో మాదిరే బాలీవుడ్లోనూ ఎంతో మంది వారసత్వ హీరోలున్నారు. ఐతే చాలా పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ సక్సెస్ కాని హీరోల్లో అభిషేక్ బచ్చన్ ఒకడు. ఇండియాస్ నంబర్ వన్‌ హీరోగా చాలా ఏళ్ల పాటు చక్రం తిప్పిన అమితాబ్ బచ్చన్ కొడుకతను. ఇంత ఘనమైన వారసత్వం ఉన్న అభిషేక్ హీరోగా అరంగేట్రం చేయడానికి చాలా కష్టపడ్డాడట. తనను హీరోగా లాంచ్ చేయమంటూ చాలామంది దర్శకులు, నిర్మాతల వెంట పడ్డాడట అతను.

కానీ వాళ్లలో ఎవ్వరూ తనను లాంచ్ చేయడానికి ముందుకు రాలేదని అతను వెల్లడించాడు. చివరికి తాను, దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా కలిసి ‘సంజాతా ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాతో అరంగేట్రం చేయాలని అనుకున్నామని.. ఈ స్క్రిప్టు మీద కూడా పని చేశామని.. కానీ తమను లాంచ్ చేయడానికి ఏ నిర్మాతా ముందుకు రాలేదని అతనన్నాడు.

చివరికి తన తండ్రి అమితాబ్ ‘అక్స్’ సినిమా చేస్తుండగా.. ఆ సినిమా సెట్స్‌లో దర్శక నిర్మాత జేపీ దత్తాను కలిశానని.. ఆయన తనను ‘రెఫ్యూజీ’ సినిమాతో లాంచ్ చేయడానికి అంగీకరించాడని అభిషేక్ వెల్లడించాడు. ఈ చిత్రంతోనే కరీనా కపూర్‌ సైతం కథానాయికగా పరిచయమైంది. ఐతే ఈ చిత్రం అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. అయినప్పటికీ కరీనా చాలా త్వరగానే కథానాయికగా మంచి స్థాయికి చేరుకుంది.

అభిషేక్ మాత్రం కెరీర్లో పెద్దగా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయాడు. ‘ధూమ్’ సిరీస్ సహా కొన్ని హిట్లు ఉన్నప్పటికీ నటుడిగా అయితే అభిషేక్‌కు పెద్దగా పేరు రాలేదు. మార్కెట్టూ పెరగలేదు. ఈ ఏడాది జూన్ 30 నాటికి అభిషేక్ నట ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి.

ఈ నేపథ్యంలో ‘రోడ్ టు 20’ పేరుతో అతను తన సినీ ప్రయాణంలోని విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ప్రస్తుతం నెపోటిజం గురించి పెద్ద చర్చ నడుస్తున్న నేపథ్యంలో తనకు ఇంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా అవకాశాలు అందుకోలేకపోయానంటూ అభిషేక్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుకుంది.