ఏపీలో ఒక్కరోజు… సంచలన సంఖ్యలో బిల్లులకు ఆమోదం

గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 2 రోజుల అసెంబ్లీ సమావేశాలను చరిత్రలో తొలిసారి చూస్తున్నాం. ఇదంతా కరోనా ప్రభావం. అయితే, వైసీపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉండటంతో సమావేశాల కాలం తగ్గినా బిల్లుల ఆమోదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతోంది. వీరికి 151 మంది మద్దతు ఉండటం ఒకటైతే… ఇతర పార్టీల నుంచి 3 ఓట్లు అనుకూలంగా ఉన్నాయి. పైగా టీడీపీకి చెందిన అచ్చెం నాయుడు రిమాండ్ ఖైదీగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో టీడీపీ బలం నిష్ఫలం.


ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వానికి నల్లేరు మీద నడకలా సులువైపోయింది. ఒక్కరోజులోనే పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మరి వేటికి ఆమోదం లభించిందన్నది చూస్తే… ఇదిగో ఇదే ఆ లిస్టు.

  1. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీ ఆమోదించింది. ఇది రేపు మండలికి వెళ్లనుంది.
  2. సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా ఆమోదించారు.
  3. దేవాదాయ చట్టంలో రెండు సవరణలను ప్రతిపాదిస్తూ ప్రవేశ పెట్టిన మరో బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.
  4. జగన్ పాలనలో పంచాయతీ రాజ్ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. వలంటీర్లు, స్పందన, సచివాలయాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించింది.
  5. స్థానిక సంస్థల ఎన్నికల సవరణ బిల్లుకు ఆమోదం
  6. జీఎస్టీ సవరణ బిల్లు (ఇవి కేంద్ర ప్రతిపాదనలకు సంబంధించినది), వ్యాట్ సవరణ బిల్లు.
  7. ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ కు ఆమోదం.

రేపు మండలి సమావేశాలు మొత్తం రాజధాని, సీఆర్డీఏ బిల్లుల చుట్టే తిరగనుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు మళ్లీ అవే బిల్లులు తేవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మండలిలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్న విషయం తెలిసిందే.