తమ్ముడి అరెస్టుపై.. అన్న జేసీ రియాక్షన్

JC

తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసిన వైనంపై టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. అరెస్టుల్ని తాము కోర్టుల్లో ఎదుర్కొంటామన్న ఆయన.. తన సోదరుడిపై వస్తున్న ఆరోపణలపై పెద్దగా రియాక్టు కాకున్నా.. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఏమీ తెలీదన్నారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టే సమర్థత వైఎస్సార్ పార్టీ నేతలకు ఉందన్న ఆయన.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేస్తున్నారన్నారు.

ఏపీ అధికారులంతా జగన్ ప్రభుత్వానికి జీ హుజూర్ అంటున్నారని.. బాబు వెంట ఉన్న వారందరిని అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేయాలన్న యోచనలో ఉన్నట్లు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నేతల ఆర్థిక మూలాల్ని దెబ్బ తీయాలన్న కుట్రకు తెర తీశారన్నారు. బ్రిటీష్ సర్కారు కంటే ఘోరమైనది జగన్ ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు.

తన సోదరుడు.. ఆయన కుమారుడు అరెస్టుపై జేసీ మాట్లాడుతూ.. మావాడు ఎవరిన్నీ లెక్క చేయడంటూ జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై స్పందించారు. తన చిన్నాన్నను రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారన్నారు.

విచారణ ఎదుర్కొనేందుకు పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించిన తర్వాత కూడా అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు. అసలు సూత్రధారుల్ని వదిలేసి.. బాధితులైన తన చిన్నాన్న.. ఆయన కుమారుడ్ని అరెస్టు చేయటం సరికాదన్నారు.