బ్రేకింగ్: జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయన కుమారుడు అరెస్టు

ఏపీ రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. మాజీ మంత్రి.. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడ్ని అరెస్టు చేసిన 24 గంటల వ్యవధిలోనే టీడీపీకి చెందిన మరో నేతను అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలో బలమైన రాజకీయ నాయకులుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు కమ్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని.. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంరతం వారిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

బీఎస్3 వాహనాల్ని బీఎస్4 వాహనాలుగా చూపించి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి అమ్మినట్లుగా వీరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దీనికి సంబంధించిన భాగోతం బయటకు వచ్చింది. దీనిపై ఫోకస్ చేసిన అధికారులు.. ఈ నేరానికి సంబంధించిన పలు విస్మయకర విషయాల్ని బయటకు తీశారు. ఈ తీరులో దాదాపు 154 వాహనాల్ని నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా గుర్తించారు. ఇందులో భాగంగా ఫేక్ ఎన్వోసీ.. ఫేక్ ఇన్యూరెన్సుల్ని దాఖలు చేసిన నేరాల్లో వీరిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేసీ ట్రావెల్స్ పై నకిలీ రిజిస్ట్రేషన్లపై 24 కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన పోలీసులు ఈ ఉదయం (శనివారం) హైదరాబాద్ కు వచ్చారు. వారు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను.. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని అనంతపురం జిల్లాకు తరలిస్తున్నారు. ఈ ఉదంతం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపటంతో.. మరిన్ని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.