రాజు గారి సినిమాకు 16 ఏళ్ల మ్యూజిక్ డైరెక్టర్

తెలుగులో ఐకాన్ ప్రొడ్యూసర్ల లిస్టు తీస్తే అందులో ఎం.ఎస్.రాజు పేరు తప్పకుండా ఉంటుంది. ఒకప్పుడు శత్రువు, దేవి, దేవీపుత్రుడు, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిర్మాత ఆయన. ఇప్పుడు టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్‌గా ఉన్న దిల్ రాజు.. తనకు స్ఫూర్తి ఎం.ఎస్.రాజే అని చెబుతుంటాడు. ఐతే ఒక దశ దాటాక ఆయన వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయారు.

చివరికి సినిమాల నిర్మాణమే ఆపేసి కొన్నేళ్ల పాటు తెరమరుగైపోయారు. ఐతే ఈ మధ్యే స్వీయ దర్శకత్వంలో ‘డర్టీ హరి’ అనే బోల్డ్ మూవీ తీసి సక్సెస్ అందుకున్నారు రాజు. యువతను ఈ చిత్రం బాగానే ఆకర్షించింది. ఆ సినిమా విజయం ఇచ్చిన ఊపులో ‘7 డేస్ 6 నైట్స్’ అనే మరో రొమాంటిక్ మూవీ తీశారు రాజు. చాలా తక్కువ రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారాయన.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు రాజు. ‘7 డేస్ 6 నైట్స్’కు కేవలం 16 ఏళ్ల వయసున్న సంగీత దర్శకుడు పని చేస్తుండటం విశేషం. ఆ కుర్రాడి పేరు.. సమర్థ్ గొల్లపు అట. అతడితో కలిసి బ్యాగ్రౌండ్ స్కోర్ సెషన్లో పాల్గొన్న వీడియోను రాజు ట్విట్టర్లో షేర్ చేశారు. మరీ ఇంత చిన్న వయసులో ఓ ఫీచర్ ఫిలింకి సంగీతం అందించడమంటే గొప్ప విషయమే.

మరి ఈ యువ ప్రతిభావంతుడిని రాజు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో? ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్‌ను 17 ఏళ్ల వయసులోనే ‘దేవి’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత ఎం.ఎస్.రాజుదే. ఇప్పుడు సమర్థ్ అనే కుర్రాడిని 16 ఏళ్లకే తన సినిమాతో లాంచ్ చేస్తున్నాడు. మరి దేవి లాగే ఈ కుర్రాడు కూడా తనదైన ముద్ర వేస్తాడేమో చూడాలి. తమిళంలో జీవీ ప్రకాష్ కుమార్, అనిరుధ్ సైతం 16-17 ఏళ్ల వయసుకే సంగీత దర్శకులుగా అరంగేట్రం చేసి గొప్ప స్థాయికి వెళ్లారు.