వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఆల్కహాల్..!

కరోనా మహమ్మారి విజృంభించకుండా ఉండేందుకు.. దానిని అరికట్టేందుకు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే ఉంది. అయితే.. ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. అందులో మందుబాబులు ఎక్కువ మంది ఉన్నారట. వ్యాక్సిన్ వేయించుకుంటే కొద్ది రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుందని.. వ్యాక్సిన్ వేయించుకోనివారు కూడా ఉన్నారట.

అందుకే.. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఓ ఫిట్టింగ్ పెట్టింది. సచ్చినట్టూ మందుబాబులు కూడా వ్యాక్సిన్ వేయించకునేలా ఓ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారికి మాత్రమే మద్యం అమ్మేలా కార్యచరణ ప్రారంభించింది. ఓ జిల్లాలో అమలు చేయడం కూడా స్టార్ట్ చేసేసింది.

మద్యం కొనుగోలు చేయాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలి. షాపు దగ్గరకు వెళ్లి డైలీ కస్టమర్‌నే గురూ అంటే సరిపోదు ఖచ్చితంగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. రెండు డోసులు వేయించుకున్నట్లుగా ఆధారం చూపించారు. ఆ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌కు మరో ఫ్రూఫ్‌గా ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లాలి. అప్పుడు మాత్రమే మద్యం అమ్ముతారు. లేకపోతే లేదు. . తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.