ఆప్త మిత్రులు.. బ‌ద్ధ శ‌త్రువులుగా

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో ఉద్య‌మ పార్టీగా టీఆర్ఎస్‌కు ఎంత‌టి కీల‌క పాత్ర పోషించిందో.. ఆ పార్టీతో సాగిన నాయ‌కులు హ‌రీశ్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్ కూడా అంతే పాత్ర పోషించార‌నేది కాద‌న‌లేని నిజం. పార్ఠీ అధినాయ‌కుడు కేసీఆర్‌తో క‌లిసి వీళ్లిద్ద‌రు ఉద్య‌మంలో చురుగ్గా వ్య‌వ‌హ‌రించారు. త‌మ మ‌ధ్య ఉన్న మంచి మైత్రితో ఆప్త మిత్రులుగా సాగారు. అధికారంలోకి వ‌చ్చాక మంత్రివ‌ర్గంలో కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టి పాల‌న‌లోనూ త‌మ ముద్ర చూపించారు. ఒక‌ప్పుడు గొప్ప స్నేహితులుగా ప్రేమ పంచుకున్న ఈ ఇద్ద‌రు.. ఇప్పుడు బ‌ద్ధ శ‌త్రువులుగా ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లకూ దిగుతున్నారు.

రాజ‌కీయాలంటేనే చిత్ర‌మైన‌వి. ఎప్పుడు ఎవ‌రు ఎలా ఉంటారో చెప్ప‌లేని ప‌రిస్థితి. శ‌త్రువులు మిత్రులుగా.. మిత్రులు శ‌త్రువులుగా మార‌తార‌ని అంటుంటారు. అందుకు ఇప్పుడు హ‌రీశ్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నార‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కాస్త వీళ్ల ఇద్ద‌రి మ‌ధ్య పోరుగా మారిపోయింది. పార్టీలో త‌న‌కు ఎదురు తిరిగార‌నే ఉద్దేశంతోనే ఈట‌ల‌పై భూక‌బ్జా కోరు ముద్ర వేసి ఆయ‌నే స్వ‌యంగా పార్టీ నుంచి వెళ్లిపోయేలా కేసీఆర్ చేశార‌నే ఆరోప‌ణ‌లు ఓ వైపు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. టీఆర్ఎస్‌ను వీడి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఈట‌ల బీజేపీ త‌ర‌పున పోటీకి సిద్ధ‌మ‌య్యారు. ఇక హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ను గెలిపించే బాధ్య‌త‌ను కేసీఆర్ హ‌రీశ్‌కు అప్ప‌గించారు. దీంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం చిలికి చిలికి గాలివాన‌లా మారుతోంది.

ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు విమ‌ర్శ‌లు స‌వాళ్ల‌తో వీళ్లిద్ద‌రూ రాజకీయ వేడిని మ‌రోస్థాయికి తీసుకెళ్తున్నారు. మొన్న‌టివ‌ర‌కూ ఒక‌రికొక‌రు తోడుగా ఒకే పార్టీలో క‌లిసి సాగిన ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి వైరం ఉన్న శ‌త్రువుల్లాగా విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. త‌న స్వ‌ప్ర‌యోజ‌నం కోస‌మే ఈట‌ల బీజేపీలో చేరార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న చేసిన అభివృద్ధి ఏమీ లేద‌ని ఇళ్లు క‌ట్టించ‌లేద‌ని ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌లేద‌ని హ‌రీశ్ విమ‌ర్శించారు. దీనిపై స్పందించిన ఈట‌ల త‌న‌తో వ‌స్తే హుజూరాబాద్‌లో చేసిన అభివృద్ధిని క‌ట్టించిన ఇళ్ల‌ను చూసిస్తాన‌ని స‌మాధాన‌మిచ్చారు. త‌న‌పై పోటీకి కేసీఆర్ లేదా హ‌రీశ్ పోటీ చేయాల‌ని స‌వాల్ విసిరారు. ఇక వ్య‌క్తిగ‌తంగానూ విమ‌ర్శ‌లు చేయ‌డానికి ఈట‌ల వెన‌క‌డ‌ట్లేదు. మొన్న‌టివ‌ర‌కూ హ‌రీశ్ ప‌ట్ల సానుభూతితో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు చేసిన ఈట‌ల ఒక్క‌సారిగా గేర్ మార్చారు.

హ‌రీశ్ ఒక ర‌బ్బ‌ర్ స్టాంప్ అని ఆయ‌న‌కు పార్టీలో స్వేచ్ఛ లేద‌ని ముఖ్య‌మంత్రి సీటుకు ఎస‌రు పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని 2018లో త‌న అనుకూల ఎమ్యెల్యేల‌కు డ‌బ్బులు పంచినందుకు కేసీఆర్ ఆయ‌న‌ను దూరం పెట్టార‌ని ఈట‌ల తాజాగా ఆరోపించారు. హ‌రీశ్ నీచుడ‌ని ఆయ‌న నిర్వాకంపై ప్ర‌జ‌లు ఉమ్మేస్తున్నార‌ని ఈట‌ల తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మొత్తానికి మొన్న‌టివ‌ర‌కూ మిత్రులుగా మెలిగిన ఈట‌ల‌, హ‌రీశ్‌.. ఇప్పుడు శ‌త్రువులుగా మారి విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.