పుష్ప.. ఇంకో రెండు వారాల్లోనే


అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. ఈపాటికి ‘పుష్ప’ సినిమా విడుదలైపోయి ఉండాలి. ఆ సినిమా కథ ఒక్క పార్ట్‌తోనే ముగిసిపోయి ఉండాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి మొత్తం కథ మార్చేసింది. ఆగస్టు 13 నుంచి సినిమాను వాయిదా వేయడమే కాదు.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన కూడా తెరపైకి వచ్చింది. చివరికి అదే ఖరారైంది.

‘పుష్ప-ది రైజ్’ పేరుతో ఫస్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి ముహూర్తం నిర్ణయించడం తెలిసిందే. అంటే ‘పుష్ప’ ఆగమనానికి ఇంకా నాలుగు నెలలు కూడా సమయం లేదు. అంటే ఈపాటికి షూటింగ్ చాలా వరకు అయిపోయి ఉండాలి. బేసిగ్గా సుకుమార్ మేకింగ్ విషయంలో కొంచెం స్లోనే అయినప్పటికీ.. ‘పుష్ప’ను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలన్న నిర్ణయం కలిసొచ్చి ఫస్ట్ పార్ట్ చిత్రీకరణ రిలీజ్ డేట్ కంటే చాలా ముందే పూర్తయిపోతున్నట్లు సమాచారం.

ఇంకో రెండు వారాల్లోనే ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ టాకీ పార్ట్ చిత్రీకరణ ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విలన్ పాత్రధారి ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’ సెట్లో‌కి అడుగు పెట్టడం.. హైదరాబాద్‌లో బన్నీ, ఫాహద్ కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం తెలిసిందే. అవి ఆఫీస్ నేపథ్యంలో నడిచే సన్నివేశాలట.

ఐతే అటవీ ప్రాంతంలో బన్నీ-ఫాహద్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది. దీంతో టీం అంతా తిరిగి గోదావరి ప్రాంతంలోని మారేడుమిల్లి అడవులకు బయల్దేరింది. ఈ సినిమా చిత్రీకరణ మొదలైందే ఆ అడవుల్లో. అక్కడ రెండు దశల్లో రెండు నెలలకుపైగా షూటింగ్ జరిపారు. సగం సినిమా చిత్రీకరణ అక్కడే జరిగింది. ఇప్పుడు చివరి షెడ్యూల్‌కు కూడా మారేడుమిల్లి అడవులే వేదిక అవుతున్నాయి. అక్కడ రెండు వారాల చిత్రీకరణతో ఫస్ట్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. టాకీ పార్ట్ అయ్యాక కొన్ని పాటలు తీయాల్సి ఉంటుంది. ఆ పని కూడా పూర్తయ్యాక రెండు నెలలకు పైగానే పోస్ట్ ప్రొడక్షన్‌కు టైం ఉంటుంది.