సోషల్ మీడియా సంస్థలకు జడ్జిలంటే లెక్క లేదు: సీజేఐ

Ramana

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వైనం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ పార్టీకో, తాము అభిమానించే రాజకీయ నాయకులకో వ్యతిరేకంగా వెలువడిన తీర్పులు జీర్ణించుకోలేక కొందరు వ్యక్తులు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారిని కించపరుస్తూ కులం ఆపాదించడం వంటి చర్యలు కలకలం రేపాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకు సంబంధించి పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిపై సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. ఆరు వారాల తర్వాత ఆ పిటిషన్లను సుప్రీం కోర్టులో లిస్ట్ చేయాలని కేంద్రానికి సీజీఐ ఎన్వీ రమణ సూచించారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా, వెబ్ మీడియాపై జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సమాజంలో సామాన్యులు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో నిర్భయంగా వ్యక్తపరిచే అవకాశముండడం మంచి విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, సోషల్ మీడియా కత్తికి రెండు వైపులా పదునుందని, మంచికి వాడితే మంచి ఆయుధమని, చెడుకు వాడితే మారణాయుధమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు సోషల్, వెబ్ మీడియాల ద్వారా సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఇంకా చర్యలు తీసుకోకపోవడంపై జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తులు చెప్పినా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తివంతమైన వ్యక్తులు చెబితేనే అవి సత్వర చర్యలు తీసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా ఫస్ట్ వేవ్ వ్యాప్తికి తబ్లిగ్ జమాత్ కారణమని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పైనా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ తరహా వార్తలకు మతం రంగు పులుముతున్నారని, ఇది దేశానికే ప్రమాదకరమని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో నకిలీ వార్తల సంఖ్య నానాటికీ పెరుగుతోందని, సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్ల జవాబుదారీతనంపై నియంత్రణ లేకపోవడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.