టచ్ మీ నాట్ అంటున్న గంటా… ?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక జనాలు హడావుడి చూసాక ఎవరూ ఇంటి పట్టున ఉండాలనుకోరు. ఓడినా సరే ఏదో రకంగా మీడియాలో జనాలలో నలగాలని చూస్తారు. కానీ గంటా మాత్రం తన రూటే సెపరేట్ అంటున్నారు. ఆయన మిగిలిన నాయకుల మాదిరిగా అసలు ఆయాసం పడకుండా ఇంటి వద్దనే రెండేళ్ళుగా గడిపేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఆగ్రహించి ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. అది ప్రస్తుతం స్పీకర్ తమ్మినేని సీతారామ్ వద్ద పెండింగులో ఉంది.

దాంతో గంటాను ఎవరూ ఎమ్మెల్యేగా మా సమస్యలు పరిష్కరించలేదు అని అడగలేరు. మరో వైపు టీడీపీకి గంటా రాజీనామా చేయకపోయినా ఆఫీస్ గడప మాత్రం తొక్కడంలేదు. ఆయన టీడీపీ వారితో టచ్ లో కూడా ఉండడంలేదు. విశాఖలో చాలా సార్లు అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్లు పెట్టినా కూడా గంటా ఎక్కడా కనిపించలేదు. అదే విధంగా ఆందోళనలు నిర్వహించినా ఆయన గాయబ్ అవుతున్నారు. తాజాగా పెట్రో ఇంధన ధరలకు వ్యతిరేకంగా టీడీపీ నిర్వహించిన నిరసనలలో కూడా ఎక్కడా గంటా కనిపించలేదు. మరి ఆయన టీడీపీలో ఉన్నట్లా లేనట్లా అన్న డౌట్లు అందరికీ వస్తున్నాయి.

అయితే గంటా వైఖరి తెలిసే పార్టీ కూడా ఆయన్ని పట్టించుకోవడం మానేసింది అంటున్నారు. ఆయన పార్టీకి ఎంత దూరమో తామూ దూరమేనని నాయకులు చెప్పకనే చెబుతున్నారు. ఇక పార్టీలో చినబాబు లోకేష్ హవా పెరగడం ఆయన సలహా సూచనల మేరకే పనిచేయాల్సి రావడం పట్ల కూడా గంటా కొంత ఆలోచించుకునే దూరంగా ఉంటున్నారు అంటున్నారు.

గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్ప‌టి నుంచి లోకేష్‌కు గంటాకు మ‌ధ్య గ్యాప్ ఉంది. లోకేష్ ఎక్కువుగా అయ్య‌న్న పాత్రుడికే ప్ర‌యార్టీ ఇచ్చేవారు. ఇవన్నీ ఇలా ఉంటే గంటా రాజకీయంగా అసలు ముఖం చూపించకుండా ఇంటి పట్టునే ఉంటే మాత్రం పూర్తిగా భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుంది అని ఆయన అనుచరులు కంగారు పడుతున్నారు. కానీ చాణక్య రాజకీయాల్లో ఆరితేరిన గంటా కొత్త రూటులో కొత్త బాటలో 2024 నాటికి కనిపిస్తారు అని కూడా అంటున్నారు చూడాలి మరి.