ఈ లెజెండ్‌ను వాడుకోండయ్యా

తెలుగులో దిగ్గజ నటుల జాబితా తీస్తే అందులో నరేష్ పేరు ఉండకపోవచ్చు. కానీ నటుడిగా ఆయనది దిగ్గజ స్థాయే. హీరోగా స్టార్ పెద్దగా స్టార్ ఇమేజ్ తెచ్చుకోకపోయినా.. కామెడీ పాత్రలతో కోట్లమంది ప్రేక్షకుల మనసులు దోచడమే కాక ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న నరేష్.. హీరోగా అవకాశాలు తగ్గుతున్న దశలో కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.

ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చి చిన్న పెద్ద అని తేడా లేకుండా మంచి పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ తరం దర్శకులు చాలామంది క్యారెక్టర్ రోల్స్ అనగానే పరభాషా నటుల వైపే చూస్తారు. వాళ్ల పట్ల ఒక రకమైన మోజు కనిపిస్తుంది.

కోట శ్రీనివాసరావు అన్నట్లు ఫలానా పాత్రకు ఫలానా నటుడైతేనే న్యాయం చేయగలడని భావించి వేరే భాషల్లోని పేరున్న నటులను తీసుకొస్తే ఓకే కానీ.. మన వాళ్ల ప్రతిభను గుర్తించకుండా ప్రతి క్యారెక్టర్, నెగెటివ్ రోల్‌నూ వేరే భాషల ఆర్టిస్టులతో చేయించడం ఎంతమాత్రం సమంజసం కాదు.

నరేష్ సంగతే తీసుకుంటే శతమానం భవతి, సమ్మోహనం లాంటి చిత్రాల్లో ఆయన ఎంత గొప్పగా నటించాడో తెలిసిందే. తాజాగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా చూసిన వాళ్లెవ్వరూ నరేష్ నటనను అంత సులువుగా మరిచిపోలేరు. చాలామంది క్యారెక్టర్ నటుల్లాగా హడావుడి చేయకుండా సటిల్‌ యాక్టింగ్‌తో హీరోయిన్ తండ్రి పాత్రను పండించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.

ముఖ్యంగా పతాక ఘట్టంలో నరేష్ నటన ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తుంది. నరేష్ నటనకు ఎన్ని అవార్డులిచ్చినా తక్కువే అనిపిస్తుంది. మంచి పాత్ర పడాలే కానీ.. నరేష్ ఎంత గొప్పగా నటించడగలడో చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణ. వాడుకోవాలే కానీ.. ఆయనలో ఇంకా చాలా కోణాలున్నాయనడంలో సందేహం లేదు. మన దర్శకులు ఇప్పటికైనా పరభాషా నటుల వెంట పడటం మాని.. మన దగ్గర ఉన్న వాళ్లలో కూడా మార్చి మార్చి అదే నటుల్ని క్యారెక్టర్ రోల్స్‌కు తీసుకోవడం మాని.. నరేష్ లాంటి దిగ్గజానికి ఆయన స్థాయికి తగ్గ పాత్రలివ్వాల్సిన అవసరం చాలా ఉంది.