జ‌గ‌న్ ఎక్క‌డుంటే.. అదే రాజ‌ధాని: మంత్రి మేక‌పాటి

ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌ధాని విష‌యం హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఒక‌వైపు అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని.. రాజ‌ధాని రైతులు 700 రోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు. కోర్టులో కేసులు కూడా న‌డుస్తున్నాయి. ఈ విష‌యంలో ఒక ఉద్విగ్న‌భ‌రిత వాతావ‌ర‌ణం నెల‌కొంది.

అయితే.. అధికార పార్టీ నేత‌లు.. మంత్రులు మాత్రం త‌ర‌చుగా అమ‌రావ‌తిపై వ్యాఖ్య‌లు చేస్తూ.. రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు. దీంతో ఒక్క‌సారిగా.. రాష్ట్రంలో చ‌ర్చ జ‌ర‌గ‌డం.. అమ‌రావ‌తి రైతులు మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌డం తెలిసిందే.

ఇటీవ‌ల మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. అమ‌రావ‌తి రైతుల‌తో చ‌ర్చించేది లేద‌ని చెప్పారు. అంతేకాదు.. కేవ‌లం 20 గ్రామాల రైతులు, ఒక సామాజిక వ‌ర్గం కోసం.. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్ర‌జ‌ల భ‌విత‌వ్యాన్ని నాశ‌నం చేయాలా? అని ప్ర‌శ్నించారు.

దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో రాజ‌ధాని రైతుల నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఈ మంట‌లు చ‌ల్లార‌క‌ముందే.. మ‌రో మంత్రి, యువ నాయ‌కుడు మేక‌పాటి గౌతం రెడ్డి.. రాజ‌ధానిపై వివాదాస్ప‌ద కామెంట్లు చేశారు. రాజ‌ధాని విష‌యంలో మంత్రి గౌతం రెడ్డి చేసిన కామెంట్లు మళ్లీ మంట‌లు రేపుతున్నాయి.

సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడుంటే.. అదే రాజధాని అనుకోవాలని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఉన్న చోటే రాజధాని అనుకోవాలని.. అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు.. రేపు మరో ప్రాంతం కావచ్చు అని చెప్పారు.

సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే.. సెక్రటేరియెట్, అదే రాజధాని అని స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దానికి అంతా కట్టుబడి ఉన్నామని తెలిపారు.  ప్రస్తుతం మంత్రి వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.