తెలంగాణ సర్కారుకు షాక్ – స్కూళ్లు తెరవద్దని తేల్చేసిన హైకోర్టు

సెప్టెంబరు ఒకటి నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కారణంగా ఆన్ లైన్ చదువులకు ప్రాధాన్యత ఇస్తున్న వేళ.. తాజాగా ప్రభుత్వం స్కూళ్లను ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. స్కూళ్లు ఓపెన్ చేయటం.. కచ్ఛితంగా స్కూళ్లకు వెళ్లాల్సిందే అన్నది సరి కాదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

విద్యా సంస్థల్లో క్లాసుల నిర్వహణ కోసం.. విద్యార్థుల్ని తప్పనిసరిగా రావాలంటూ బలవంతం చేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. నేరుగా స్కూళ్లకు రాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. బడికి రావాలా? వద్దా? అన్న అంశంపై విద్యార్థుల ఇష్టానికి వదిలేయాలని పేర్కొంది. అంతేకాదు.. స్కూళ్లు ఓపెన్ చేయకుండా ఆన్ లైన్ లో మాత్రమే పాఠాలు బోధించే విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవద్దని.. ఆన్ లైన్ లో కానీ ఆఫ్ లైన్ లో కానీ క్లాసుల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది.

ప్రత్యక్ష బోధన చేసే విద్యా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాలని.. ఇందుకు వారం గడువును ఇస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. స్కూళ్లు.. కాలేజీల క్లాసుల నిర్వహణ మీద విద్యార్థులు.. విద్యా సంస్థల ఇష్టానికి వదిలేసిన హైకోర్టు.. హాస్టల్స్ విషయంలో మాత్రం.. స్టే ఇవ్వటం గమనార్హం.

గురుకులాలు.. విద్యాసంస్థల్లో హాస్టల్స్ తెరవొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ ఉన్న వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు.. అక్టోబరులో మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు జారీ అవుతున్న వేళ.. స్కూళ్లు తెరవటంపై లాభనష్టాలు రెండూ ఉన్నాయని చెప్పింది. విద్యా సంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నట్లుగా చెప్పిన హైకోర్టు.. రెండు అంశాల్ని సమన్వయం చేసుకోవాలని పేర్కొంది.

ఈ పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబరు నాలుగుకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. హాస్టల్స్ తెరిచే విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి స్టే ఇచ్చిన హైకోర్టు.. స్కూళ్ల ఓపెనింగ్ మీద మాత్రం ‘తప్పనిసరి’ అన్నది లేకుండా ఎవరి వెసులుబాటుకు తగ్గట్లు వారు వ్యవహరించాలన్నట్లుగా హైకోర్టు పేర్కొన్నట్లుగా చెప్పొచ్చు.