బొత్స వేస్ట్.. తేల్చి పారేసిన ఆర్ ఆర్ ఆర్‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌రచుగా కామెంట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఎప్పుడు మాట్టాడినా.. అమ‌రావ‌తి ఉండ‌ద‌ని.. మూడు రాజ‌ధానులే రాష్ట్రానికి శాశ్వ‌త‌మ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా కూడా రెండు రోజుల కింద‌ట బొత్స సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేవ‌లం 20 గ్రామాల ప్ర‌జల కోసం.. ఒక సామాజిక వ‌ర్గం ప్ర‌యోజ‌నం కోసం రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తును నాశ‌నం చేయ‌మంటారా? అంటూ.. ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు.. అమ‌రావ‌తి విష‌యంపై రైతుల‌తో చ‌ర్చించేది లేద‌ని క‌రాఖండీగా చెప్పుకొచ్చారు.

వాస్త‌వానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. రాజ‌ధానిలో రైతులు క‌దం తొక్కుతున్న విష‌యం తెలిసిందే. దాదాపు 700 రోజులుగా ఇక్క‌డి రైతులు.. త‌మ ఆవేద‌న‌ను ఆక్రోశాన్నీ .. వివిధ రూపాల్లో వెల్ల‌డిస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేశారు. న్యాయ‌స్థానాల్లో త‌మ భవితవ్యం ఏంటంటూ.. పిటిష‌న్లు వేశారు. ప్ర‌స్తుతం ఇవి.. వ‌చ్చే నెల నుంచి మ‌రోసారి.. రోజు వారీ విచార‌ణ‌కు రానున్నాయి. వాస్త‌వానికి గ‌తంలోనే రోజువారీ విచార‌ణ‌కువ‌చ్చిన‌ప్ప‌టికీ.. ప్ర‌దాన న్యాయ‌మూర్తి బదిలీ అవ‌డంతో నిలిచిపోయాయి.

తిరిగి ఇప్పుడు మ‌ళ్లీ రోజు వారీ విచార‌ణ‌కు వ‌స్తున్నాయి. మ‌రి ఇప్పుడు న్యాయస్థానం ఏం తేలుస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఇదిలావుంటే,, బొత్స మాత్రం.. రాజ‌ధానిరైతుల‌తో చ‌ర్చించేది లేద‌ని అన్నారు. దీనిపై అక్క‌డి రైతులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “మంత్రి బొత్స సత్యనారాయణ అజ్ఞాని. రాజధాని అమరావతి గురించి ఏం తెలుసు? రైతులతో చర్చలు లేవనడం దారుణం” అని అమరావతి దళిత జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఉనికిని కాపాడుకోవడం కోసం రాజధాని రైతుల గురించి అనేకమార్లు బొత్స విమర్శలు చేశారని దుయ్యబట్టారు.

కొన్నాళ్ల కిందట అమరావతిలో పర్యటించి అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పిన మంత్రి బొత్స, తన పదవి పోతుందనే భయంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ కృష్ణ‌రాజు కూడా బొత్స వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. అయితే.. ఈయ‌న ఎక్క‌డా బొత్స‌పై విమ‌ర్శ‌లు చేయ‌కుండానే.. సైలెంట్‌గా వాత పెట్టారు.

బొత్స గారు చాలా సీనియ‌ర్ ఆయ‌న ఎలా వ్యాఖ్యానించారో.. ఆయ‌న‌కే తెలియాలి. ప్ర‌స్తుతం కోర్టులో పెండింగులో ఉన్న అంశంపై ఆయ‌న ఆచితూచి మాట్లాడితే బాగుండేది. అయినా.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. బొత్స వ్యాఖ్య‌ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేదు. అని తేల్చి పారేశారు. మొత్తానికి బొత్స వ్యాఖ్య‌లు టీక‌ప్పులో తుఫాను మాదిరిగా మారింద‌ని ఎంపీ చెప్పుకొచ్చారు. మ‌రి ఇప్ప‌టికైనా బొత్స త‌న వ్యాఖ్య‌ల‌ను స‌రిచేసుకుంటారో లేదో చూడాలి.