ఒక సామాన్యుడి ఆలోచన టాంక్ మీద రేర్ సీన్

ఒకరి ఆలోచన కోట్లాది మంది మీద ప్రభావితం చూపిస్తుందన్న మాట తెలిసిందే. ఒక సామాన్యుడి మదిలో మెదిలిన ఆలోచనకు మంత్రి కేటీఆర్ వత్తాసు పలకటం.. ఆ సంగతేదో కాస్త చూడండి అన్న ట్వీట్ మాటతో అధికార బలగం మొత్తం కదిలి.. మంత్రి అభీష్టాన్ని వారంలోపే నెరవేర్చటంతో టాంక్ బండ్ మీద ఇంతకు ముందెప్పుడూ చూడని ఒక రేర్ సీన్ అవిష్కృతమైంది.

రోడ్డు మధ్యలో కూర్చొని పిల్లలతో.. కుటుంబ సభ్యులతో సెల్పీలు తీసుకోవటం.. చిన్నారులు ఇంటి ఆవరణలో మాత్రమే నడిపే బుజ్జి సైకిళ్లను ట్యాంక్ బండ్ రోడ్ల మీద నడపటం లాంటివెన్నో సిత్రాలు దర్శనమిచ్చాయి. నిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉండే ట్యాంక్ బండ మీద పిల్లల.. పెద్దలతో హడావుడిగా కనిపించింది. వారం క్రితం ఒక నెటిజన్ ట్యాంక్ బండ్ మీద ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకువాహనాల్ని అనుమతించకుండా ఉంటే.. సామాన్యులంతా కుటుంబ సభ్యులతోకలిసి సెలవు రోజుల్ని ఆహ్లాదాన్ని అస్వాదించొచ్చు కదా? అని చెప్పటం..దానికి స్పందించిన మంత్రి కేటీఆర్ ఓకే చేయటం.. ఆ విషయాన్ని సంబంధిత అధికారులు చూడాల్సిందిగా ఆదేశించారు.

దీంతో.. ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం సాయంత్రాలు వాహనాల్ని ట్యాంక్ బండ్ మీదకు వెళ్లకుండా ఏర్పాట్లు చేసి.. సామాన్యులు స్వేచ్ఛగా తిరిగేలా ఏర్పాట్లు చేశారు. దీంతో.. నిత్యం వందలాది వాహనాలు అనుక్షణం తిరిగే ట్యాంక్ బండ్ మొత్తం బోసిపోయింది. వాహనం అన్నది కనిపించకుండాపోవటంతో.. అధికారులు తీసుకున్న నిర్ణయంతో పెద్ద ఎత్తున నగర ప్రజలు ట్యాంక్ బండ్ మీదకు చేరుకొన్నారు. రోటీన్ కు భిన్నంగా ట్యాంక్ బండ్ మీద ఉత్సాహంగా కలయదిరిగారు.

ఈ ఏర్పాట్లను పరిశీలించటానికి వచ్చిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ను కొందరుమహిళలు అభినందించారు. సీపీ సైతం స్పందిస్తూ.. ట్యాంక్ బండ్ ను చూస్తుంటే పాండిచ్చేరిలా ఉందన్న వ్యాఖ్య చేశారు. సందర్శకుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. ట్యాంక్ బండ్ మీద వాహనాల్ని అనుమతించకపోవటంతో.. లోయర్ ట్యాంక్ బండ్ వద్దట్రాపిక్ జాం అయి.. ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొందరు ఎంజాయ్ చేయాలంటే మరికొందరు తిప్పలు పడక తప్పదేమో?