ఈ సినిమా రీమేక్ కాదా?

నూటొక్క జిల్లాల అందగాడు.. అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన కామెడీ చిత్రం. రాచకొండ విద్యాసాగర్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, అగ్ర నిర్మాత దిల్ రాజు కలిసి నిర్మించడం విశేషం. సెప్టెంబరు 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా ఫస్ట్ టీజర్ చూసినపుడే ఇది బాలీవుడ్ మూవీ ‘బాల’కు కీరమేక్ అని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. అందులో హీరోగా చేసిన ఆయుష్మాన్ ఖురానా కూడా బట్టతలతో ఇబ్బందులు పడుతుంటాడు. సినిమా కథంతా కూడా బట్టతల చుట్టూనే తిరుగుతుంది.

చాలా హిలేరియస్‌గా సాగుతూనే.. చివర్లో ప్రేక్షకులను ఎమోషన్‌కు గురి చేసే ఈ చిత్రం అక్కడ మంచి ఫలితాన్నందుకుంది. దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లు అడాప్ట్ చేసుకుని ‘నూటొక్క జిల్లాల అందగాడు’ తీశారనే అంతా అనుకుంటున్నారు. మీడియాలో.. సోషల్ మీడియాలో కూడా ఇలాగే వార్తలొచ్చాయి.

కానీ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ రీమేక్ కాదన్నట్లుగా దీని నిర్మాత క్రిష్ పేర్కొన్నాడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘బాల’ సినిమా విడుదల కావడానికి కొన్నేళ్ల ముందే ‘నూటొక్క జిల్లాల అందగాడు’ కథ తయారైందని వెల్లడించాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ సినిమా సందర్భంగా ఈ చిత్రానికి పునాది పడిందన్నాడు.

ఆ సినిమా కోసం జార్జియాలో షూటింగ్ జరుగుతున్నపుడు అవసరాల శ్రీనివాస్ తనకు, నిర్మాత రాజీవ్ రెడ్డికి ఈ కథ చెప్పాడని.. 20 నిమిషాల పాటు చెప్పిన ఈ కథ చాలా హిలేరియస్‌గా అనిపించిందని క్రిష్ తెలిపాడు. ఐతే రెండేళ్ల తర్వాత దర్శకుడు విద్యాసాగర్ తనకో థ్రిల్లర్ కథ చెప్పాడని.. దాన్ని అవసరాలతో చేద్దామని అడిగితే అప్పుడు మాటల సందర్భంలో అంతకుముందు చెప్పిన కథ గురించి చర్చ వచ్చిందని.. ఆ కథకు ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే టైటిల్ కూడా పెట్టానని చెప్పాడని.. కథను మరింత వివరంగా చెప్పాడని.. అది బాగా నచ్చే ఆ కథతోనే సినిమా చేద్దామని నిర్ణయించుకున్నామని.. అలా ‘కంచె’తో మొదలైన ఈ కథ.. సెప్టెంబరు 3న కంచెకు చేరబోతోందని క్రిష్ పేర్కొన్నాడు.