ఆ ఏపీ మంత్రి గారు.. ఊరు దాటి రారా ?


ఆయన మంత్రి కాక ముందు బాగా చురుకు. అసలు రాజకీయాల్లోకి రాక ముందు ఇంకా చురుకు. ఆయన చదువుల్లో టాపర్. డాక్టర్ కోర్స్ చదివి తానున్న ఊరికి డాక్టర్ గా సుపరిచితులు. సేవాభావం కూడా ఎక్కువ. అందుకే జగన్ ఆయన్ని ఇలా పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేశారు. ఆ తరువాత ఏడాది తిరగకుండానే మంత్రిని చేశేశారు. ఇదంతా కూడా శ్రీకాకుళం జిల్లా పలాస‌ ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు రాజకీయ అదృష్టంగానే చెప్పుకుంటారు.

ఆయన కూడా మంత్రి అయ్యేంతవరకూ కూడా అధినాయకత్వం దృష్టిలో పడేలా అనేక కార్యక్రమాలు దూకుడుగా చేపట్టారు. కానీ ఇపుడు ఆయన ఎందుకో ఒక్కసారిగా జోరు తగ్గించేశారు. ఆయన ఉంటే అమరావతి లేకుంటే సొంత ఊరు పలాస‌ అన్నట్లుగా మారిపోయారు. ఈ మధ్యలో శ్రీకాకుళం జిల్లా అని ఒకటి ఉందని అసలు ఆలోచించడంలేదు. శ్రీకాకుళం జిల్లాలో జరిగే ప్రతీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ హాజరవుతారు.

అదే విధంగా స్పీకర్ గా ఉంటున్న కూడా తమ్మినేని సీతారామ్ కూడా జిల్లాలో తిరుగుతూ హడావుడి చేస్తున్నారు. కానీ మంత్రి గారు కలెక్టరేట్ ముఖం చూస్తే ఒట్టు అన్నట్లుగా ఉంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎంతసేపూ పలాసాలోనే ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ ఆయన రాష్ట్ర మంత్రి. కనీసం జిల్లాలోనైనా అభివృద్ధి పనులు చూడాలి కదా. అంతే కాదు, పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలి కదా అన్న విమ‌ర్శ‌లు సొంత పార్టీ నేత‌ల నుంచే వినిపిస్తున్నాయి.

ఇక అధికారులతో సమావేశాలు నిర్వహించి ఎప్పటికపుడు జిల్లా బాగోగులు చూస్తూ ముందుకు సాగాలి కదా. కానీ ఎందుకో సీదరి అప్పలరాజు రూటే సెపరేట్ అని సొంత పార్టీలోనే అంటున్నారు. ఇలాగైతే సుదీర్ఘకాలం ఆయన రాజకీయంగా కొనసాగడం డౌటే అంటున్నారు. మరి జగన్ దృష్టిలో ఇవన్నీ కనుక ఉంటే విస్తరణలోనే పదవి పోవచ్చు అన్న టాక్ కూడా ఉందిట.