దిల్ రాజైనా కాపాడతాడా?

దిల్ రాజైనా కాపాడతాడా?

ఉయ్యాల జంపాల.. సినిమా చూపిస్త మావ.. కుమారి 21 ఎఫ్.. ఇలా కెరీర్ ఆరంభంలో వరుస హిట్లతో మంచి ఊపు మీద కనిపించాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్. కానీ ఆ తర్వాత ఈ సక్సెస్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. గత రెండేళ్లలో అతను చేసిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. కొత్త ఏడాదిలో ‘రంగులరాట్నం’.. ‘రాజుగాడు’ మరీ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. దీంతో ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘లవర్’ మీదే ఉన్నాయి.

దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడంతో రాజ్ తరుణ్ రాత మారుతుందేమో అని చూస్తున్నారు. ‘అలా ఎలా’తో హిట్ కొట్టిన అనీష్ కృష్ణ డైరెక్ట్ చేయడం కూడా ఆశలు రేపుతోంది. ఐతే ఈ చిత్ర ప్రమోషన్లలో దిల్ రాజు సైతం సినిమాపై ఏమంత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయలేదు.

ఈ రోజుల్లో చిన్న సినిమాల్ని ప్రొడ్యూస్ చేయడం.. రిలీజ్ చేయడం ఎంత కష్టమైపోతోందో చెబుతూ.. పరోక్షంగా ‘లవర్’ విషయంలో తనకున్న టెన్షనంతా బయటపెట్టాడు రాజు. రాజ్ తరుణ్ మార్కెట్ నాలుగు కోట్లే అని.. కానీ అతడి మార్కెట్‌కు రెట్టింపు ఖర్చు పెట్టామని అన్నాడాయన. ఐతే తన అన్న కొడుకు హర్షిత్ పూర్తి స్థాయి నిర్మాతగా మారడంతో రాజు రాజీ పడకుండా ఈ సినిమాకు ఖర్చు పెట్టాడు.

మరి ఈ చిత్రం వీళ్లందరికీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. దీంతో పాటుగా ఈ వారాంతంలో ‘వైఫ్ ఆఫ్ రామ్’.. ‘ఆటగదరా శివ’.. ‘పరిచయం’ సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. వీటిలో దేనికీ అంత బజ్ లేదు. ఉన్నంతలో ‘లవర్’ పరిస్థితే మేలు. మరి ఈ అడ్వాంటేజీని రాజ్ తరుణ్ సినిమా ఏమాత్రం సద్వినియోగం చేసుకుంటుందో.. ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు