నానీని మ‌రీ ఇలా టార్గెట్ చేయ‌డం ఎంతవ‌ర‌కు స‌మంజ‌స‌మో?

నేచుర‌ల్ స్టార్ నాని ఉన్న‌ట్లుండి టాలీవుడ్ ఎగ్జిబిట‌ర్ల దృష్టిలో పెద్ద విల‌న్ అయిపోయాడు. అత‌డి పాటికి అత‌ను సైలెంటుగా ఉంటే స‌రిపోయేది కానీ.. తిమ్మ‌ర‌సు ప్రి రిలీజ్ ఈవెంట్లో తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌కు ఉన్న ప్రాధాన్యం గురించి.. వెండితెర‌ల్లో సినిఆమ‌లు చూసే మ‌న వాళ్ల సంస్కృతి గురించి పెద్ద లెవెల్లో స్పీచ్ ఇవ్వ‌డ‌మే త‌ప్ప‌యిపోయింది. అంత‌లా స్పీచ్ ఇచ్చి త‌న కొత్త‌ చిత్రం ట‌క్ జ‌గ‌దీష్‌ను ఓటీటీకి ఇచ్చేస్తుంటే ఎలా ఊరుకున్నాడంటూ ఎగ్జిబిట‌ర్లు అత‌డి మీద దండెత్తుతున్నారు.

అంత‌టితో ఆగ‌కుండా తాజాగా జ‌రిగిన తెలంగాణ ఫిలం ఛాంబ‌ర్‌లో కొంద‌రు సునీల్ నారంగ్ స‌హా కొంద‌రు నాని మీద చేసిన వ్యాఖ్య‌లు, హెచ్చ‌రిక‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ముఖ్యంగా ఓ వ్య‌క్తి నాని మీద తీవ్ర ఆరోప‌ణ‌లే చేశారు. అత‌డి త‌ర్వాతి సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ కానివ్వం అన్న‌ట్లుగా హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

నాని థియేట‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా స్పీచ్ ఇచ్చింది ట‌క్ జ‌గ‌దీష్‌కు ఓటీటీ నుంచి ఎక్కువ రేటు రాబ‌ట్టుకోవ‌డానికే అని స‌దరు ఎగ్జిబిట‌ర్ ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. అప్ప‌టికే అమేజాన్ ప్రైమ్ వాళ్ల‌తో ట‌క్ జ‌గ‌దీష్‌ రేటు గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని.. నిర్మాత‌లు అనుకున్న రేటు కంటే రూ.4 కోట్లు త‌క్కువ కోట్ చేశార‌ని.. ఐతే నాని తిమ్మ‌ర‌సు ఈవెంట్లో థియేట‌ర్లకు అనుకూలంగా మాట్లాడ‌టంతో ఎక్క‌డ ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేస్తారేమో అన్న భ‌యంతో ఓటీటీ వాళ్లు వీళ్లు అడిగినట్లే ఇంకో రూ.4 కోట్లిచ్చి సినిమాను తీసేసుకున్నార‌ని ఆరోపించాడు ఆ ఎగ్జిబిట‌ర్.
ఈ విష‌యం చెప్పి నానికి తామేంటో చూపిస్తామ‌ని.. ఇండియా వైడ్ మ‌ల్టీప్లెక్స్ య‌జ‌మానులు సైతం త‌మ‌తోనే ఉన్నార‌ని.. అంద‌రం క‌లిసి నానికి ఏం చేయాలో అది చేస్తామ‌ని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి నాని నుంచి రానున్న కొత్త చిత్రాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌కుండా ఇబ్బంది పెడ‌తారేమో అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. త‌న ప్రమేయం పెద్దగా లేని విష‌యంలో నానీని మ‌రీ ఇలా టార్గెట్ చేయ‌డం ఎంతవ‌ర‌కు స‌మంజ‌స‌మో?