టాక్ సూప‌ర్.. పోటీ లేదు.. దంచుకుంటాడా?

మొత్తానికి క‌రోనా సెకండ్ వేవ్ బ్రేక్ త‌ర్వాత టాలీవుడ్లో యూనివ‌ర్శ‌ల్ అప్లాజ్ తెచ్చుకునే సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. గ‌త మూడు వారాల్లో చాలా సినిమాలు వ‌చ్చాయి. అందులో ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం, పాగ‌ల్ చిత్రాల‌కు ఓపెనింగ్స్ ప‌ర్వాలేదు. కానీ త‌ర్వాత అవి నిల‌బ‌డ‌లేదు.

తిమ్మ‌ర‌సుకు టాక్ ఓ మోస్త‌రుగా రాగా.. ఓపెనింగ్స్ కూడా ఓ మోస్త‌రుగానే వ‌చ్చాయి. మిగ‌తా చిత్రాల గురించి మాట్లాడ‌టానికి ఏమీ లేదు. పూర్తి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వ‌సూళ్లు రాబ‌ట్టే చిత్రం కోసం అంద‌రూ ఎదురు చూస్తున్నారు. రాజ రాజ చోర అలాంటి చిత్ర‌మే అవుతుంద‌న్న అంచ‌నాలు విడుద‌ల‌కు ముందు క‌లిగాయి. రిలీజ్ త‌ర్వాత ఆ అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి.

ఈ చిత్రానికి ఫుల్ పాజిటివ్ టాక్ వ‌చ్చింది. రివ్యూల‌న్నీ బాగున్నాయి. సోష‌ల్ మీడియా టాక్ సూప‌ర్. మౌత్ ప‌బ్లిసిటీ కూడా బాగానే జ‌రుగుతోంది. కాక‌పోతే శ్రీవిష్ణు మాస్ హీరో కాదు కాబ‌ట్టి వ‌సూళ్లు పుంజుకోవ‌డానికి టైం ప‌ట్టేలా ఉంది. గురు, శుక్ర‌వారంలో ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. గురువారం రాజ రాజ చోర‌తో పాటుగా క్రేజీ అంకుల్స్, క‌న‌బ‌డుట లేదు చిత్రాలు రిలీజ‌య్యాయి.
శుక్ర‌వారం బ‌జార్ రౌడీ వ‌చ్చింది. ఈ చిత్రాల‌కు పూర్తి నెగెటివ్ టాక్ వ‌చ్చింది. అవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిల‌బ‌డే ప‌రిస్థితి లేదు. ఓవైపు రాజ రాజ చోర‌కు టాక్ సూప‌ర్. పైగా పోటీలో ఉన్న సినిమాల‌న్నీ తుస్సుమ‌న్నాయి.

ఈ నేప‌థ్యంలో వీకెండ్లో రాజ రాజ చోర అద‌రగొట్ట‌డానికి అవ‌కాశ‌ముంది. శ‌ని, ఆదివారాల్లో ఈ చిత్రానికి ఆక్యుపెన్సీ పెరుగుతుంద‌ని.. ఫుల్స్ కూడా ప‌డ‌తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అదే జ‌రిగితే ఈ చిత్రం వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకునేందుకు ఛాన్సుంది. మ‌రి రాజ రాజ చోర ఏమేర ప్రేక్ష‌కుల నుంచి వ‌సూళ్ల‌ను దోచుకుంటాడో చూడాలి.