బాలీవుడ్లో ఈ జానర్ ఓవర్ డోస్


ప్రేక్షకుల రోమాలు నిక్కబొడొచుకునేలా చేయాలన్నా.. వారిలో భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లాలన్నా దేశభక్తితో ముడిపడ్డ చిత్రాలు మంచి ఛాయిస్. ఈ జానర్లో బాలీవుడ్లో వందల్లో సినిమాలు వచ్చాయి. పదుల సంఖ్యలో సినిమాలు ప్రేక్షకులను కదిలించి వారి మనసులపై చెరగని ముద్ర వేశాయి. దేశ సరిహద్దుల్లో ఏ కీలక పరిణామం జరిగినా దాని మీద సినిమా తయారైపోతుంటుంది బాలీవుడ్లో. అలాగే చరిత్ర లోతుల్లోకి వెళ్లి ఎప్పుడెప్పుడో జరిగిన యుద్ధాలు.. దేశాల మధ్య ఘర్షణలు.. ఉగ్రవాదులతో పోరాటాలు.. వంటి ఉదంతాలను తీసుకుని రక్తి కట్టించేలా సినిమాలు తీస్తుంటారు అక్కడి ఫిలిం మేకర్స్.

ఐతే ఇలాంటి కథల్ని ఎంత ఆసక్తికరంగా తీస్తున్నప్పటికీ.. ఆ సినిమాలన్నీ ఒకే విధంగా తయారవుతుండటంతో వస్తోంది సమస్య. ఒక సినిమా కిక్ ఇచ్చాక అలాంటి సినిమానే ఇంకొకటి చూస్తే ఆ కిక్ కనిపించదు. ఇప్పుడు హిందీలో వచ్చే దేశభక్తి సినిమాల పరిస్థితి అలాగే తయారవుతోంది.

ఓవైపు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన విక్రమ్ బత్రా జీవిత కథ ఆధారంగా ‘షేర్షా’ అనే సినిమా ప్రేక్షకులను అలరిస్తున్న సమయంలోనే.. ఒకప్పటి భుజ్ ప్రాంతంలో పాక్ సైన్యంతో భారత సైనికులు, పౌరులు పోరాడిన ఉదంతం నేపథ్యంలో తెరకెక్కిన ‘భుజ్’ను రిలీజ్ చేస్తే దాన్ని ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ చిత్రంలో దేశభక్తిని, భావోద్వేగాలను ప్రేక్షకులు ఫీల్ కాలేకపోయారు.

ఇక తాజాగా అక్షయ్ కుమార్ సినిమా ‘బెల్ బాటమ్’ రిలీజ్ కాగా.. ఇది కూడా దేశభక్తితో ముడిపడ్డ చిత్రమే. 80వ దశకంలో జరిగిన హైజాక్ నేపథ్యంలో ఈ సినిమాను తీర్చిదిద్దారు. గతంలో అక్షయ్ కుమారే ఎయిర్ లిఫ్ట్ అనే సినిమాలో నటించాడు. దాంతో ‘బెల్ బాటమ్’కు పోలికలు కనిపించాయి. అలాగే దేశభక్తి నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలను ఈ చిత్రం గుర్తు చేసింది. గత కొన్నేళ్లలో ఆ జానర్లో పదుల సంఖ్యలో సినిమాలు రావడంతో ‘బెల్ బాటమ్’ ఎంత బాగా తీసినా కూడా ప్రేక్షకులకు కొత్తదనం కనిపించలేదు. మొనాటనస్ ఫీలింగ్ కలుగుతోంది.

ఈ నేపథ్యంలో ‘బెల్ బాటమ్’కు బాక్సాఫీస్ దగ్గర అంత మంచి ఫలితం దక్కేలా లేదు. దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్లో దేశభక్తి సినిమాల డోస్ బాగా ఎక్కువైపోయిందన్నది స్పష్టం. ఈ జానర్‌‌ను అక్కడి ఫిలిం మేకర్స్ కొన్నాళ్లు పక్కన పెట్టడం మంచిదేమో.