ఆఫ్ఘాన్ లో చిక్కుకున్న తెలంగాణ యువకులు..!

ఆప్ఘనిస్తాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ దేశాన్ని తాలిబాన్లు అక్రమించుకున్న సంగతి తెలిసిందే. కాగా… తాలిబన్లు రాజ్యమేలుతున్న ఆప్ఘానిస్థాన్‌లో ఇద్దరు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. ఉపాధి నిమిత్తం కాబుల్ వెళ్లిన మంచిర్యాల జిల్లాకు బొమ్మన రాజన్న.. గత 8 ఏళ్లుగా అక్కడే ఏసీసీఎల్ సంస్థలో పని చేస్తున్నారు. ఆప్ఘాన్‌లో రోజుల వ్యవధిలోనే పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో.. ఆయన ఆందోళనలో ఉన్నారు. జూన్ 28న మంచిర్యాల వచ్చిన రాజన్న.. ఆగస్టు 7నే అక్కడికి వెళ్లారు.

ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో భారత్‌కు తిరిగి రావడానికి విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 18న రాజన్నను తిరిగి భారత్ పంపేందుకు ఆయన పనిచేసే సంస్థ సైతం టికెట్లు బుక్ చేసింది. కానీ ఈలోపే రాజధాని కాబుల్ సైతం తాలిబన్ల వశమైంది.

దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఆయన అక్కడే చిక్కుకుపోయారు. రాజన్నతోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన పెంచల వెంకన్న సైతం ఆప్ఘాన్‌లోనే చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా భారతదేశానికి తీసుకెళ్లాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ఆప్ఘనిస్థాన్‌లోని పరిస్థితులను మీడియా ద్వారా తెలుసుకుంటున్న ఇరువురి కుటుంబ సభ్యులు.. వారి క్షేమ సమాచారంపై ఆందోళన చెందుతున్నారు.