బీజేపీ, కాంగ్రెస్ పోటీ దేనితోనే తెలుసా ?

వచ్చే ఎన్నికల్లో ఇరగదీసేస్తామని ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ నేతలు భీబత్సమైన ప్రకటనలు చేసేస్తున్నారు. విచిత్రమేమిటంటే 2024లో అధికారంలోకి రావాల్సిందే అని కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధి నేతలతో గట్టిగా చెప్పారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే రెండుపార్టీలకూ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు కూడా లేరన్నది వాస్తవం.

నిజానికి రెండు పార్టీలు కూడా పోటీపడాల్సింది నోటాను దాటాలనే. నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబోవ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. 2014, 19 లో ఈ రెండు పార్టీలకన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే రెండుపార్టీల మీద జనాలకు ఏమాత్రం నమ్మకం లేదని తేలిపోయింది. వాస్తవం ఇలాగుంటే రెండుపార్టీల నేతలు మాత్రం జనాలే ఆశ్చర్యపోయేస్ధాయిలో ప్రకటనలు ఇస్తుండటమే విచిత్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ రెండుపార్టీలూ నోటాతో పోటీపడేట్లే ఉన్నాయి.

మొన్నటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి ఈ రెండు పార్టీల తరపున అసలు అభ్యర్ధులే దొరకలేదు. ఇక పోటీచేసిన నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. అప్పటి విషయమే కాదు ఈమధ్యనే జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా అన్నీ చోట్లా పోటీచేయటానికి ఈ రెండు పార్టీలకు అభ్యర్ధులు దొరక్క చేతులెత్తేశాయి. ఇలాంటి పార్టీలు కూడా వైసీపీని సవాలు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

ఈ మధ్యనే రాహూల్ గాంధీ ఏపి నేతలతో సమావేశమై 2024లో అధికారంలోకి వచ్చేయాలని చెప్పటమే ఆయన అమాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. అధికారంలోకి రావాలంటే చేయాల్సింది నేతలను పిలిపించుకుని నాలుగు గోడలమధ్య సమావేశాలు పెట్టి ఆదేశాలు ఇవ్వటంకాదు. వరుసగా రెండు ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్ధులు ఎందుకు ఒక్క నియోజకవర్గంలో గెలవలేదు ? అసలు డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదు ? అని నిజాయితీగా విశ్లేషించాలి. ఇదే పద్దతిలో బీజేపీ అగ్రనేతలు కూడా విశ్లేషించుకుంటే వాస్తవాలు ఏమిటో అర్ధమవుతుంది.