గుణశేఖర్‌కు వీరతాడు వెయ్యాల్సిందే


టాలీవుడ్లో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ రూటే వేరు. ప్రేక్షకుల అంచనాలకు భిన్నమైన సినిమాలతో ఎప్పటికప్పుడు ఆయన సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. చాలాసార్లు ఆయన తలకు మించిన భారం అనిపించే ప్రాజెక్టులనే నెత్తికెత్తుకుంటూ ఉంటాడు. ‘సొగసు చూడతరమా’ లాంటి క్లాస్ లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయం అయి.. ఆ వెంటనే ‘బాల రామాయణం’ లాంటి చిత్రమైన సినిమా తీసినా.. ఆపై చూడాలని ఉంది, ఒక్కడు లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్లతో ఔరా అనిపించినా ఆయనకే చెల్లింది.

బ్లాక్‌బసర్లతో సమానంగా డిజాస్టర్లూ అందించిన గుణశేఖర్.. ‘బాహుబలి’ లాంటి మెగా మూవీ తెరకెక్కుతున్న టైంలోనే అదే తరహాలో ‘రుద్రమదేవి’ లాంటి భారీ చిత్రాన్ని లైన్లో పెట్టాడు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఆ సినిమాను పూర్చి చేశాడు. ‘బాహుబలి’ తర్వాత దాన్ని రిలీజ్ చేసి బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి ఫలితాన్నే అందుకున్నాడు.

ఆపై ‘హిరణ్యకశ్యప’ లాంటి భారీ చిత్రం తీయాలనుకున్నాడు కానీ.. అది సాధ్య పడక చారిత్రక నేపథ్యంలోనే ‘శాకుంతలం’ సినిమాను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఐతే ఇది కూడా భారీ బడ్జెట్‌తో, పెద్ద పెద్ద సెట్టింగ్స్‌తో ముడిపడ్డ చిత్రం. ఈ టైపు సినిమాలు తీయాలంటే చాలా సమయమే పడుతుంది. ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుని ఇలాంటి సినిమాలు తీస్తుంటారు. గుణశేఖర్ స్వయంగా తెరకెక్కించిన ‘రుద్రమదేవి’కి కూడా కొన్నేళ్లు సమయం వెచ్చించాడు గుణ. కానీ ‘శాకుంతలం’ సినిమాను మాత్రం మామూలు సినిమాల మాదిరే చకచకా లాగించేస్తుండటం విశేషం. కరోనా సెకండ్ వేవ్‌కు రెండు నెలల ముందు ఈ చిత్రం మొదలైంది. అటు ఇటుగా నెలన్నర రోజుల షూటింగ్‌లో సగం సినిమాను ముగించేశాడు గుణశేఖర్.

ఇక సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత నెలన్నర కిందటే షూటింగ్ పున:ప్రారంభించగా.. అప్పుడే సినిమా చివరి దశకు వచ్చేసింది. లీడ్ రోల్ చేస్తున్న సమంతకు సంబంధించిన చిత్రీకరణ అంతా అయిపోయిందంటే.. సినిమా ముగింపు దశలో ఉన్నట్లే. కొన్ని చిన్న సీన్లు తీసేస్తే టాకీ పార్ట్ అయిపోతుందట. అంటే ఇంత భారీ చిత్రం మూణ్నాలుగు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంటోందన్నమాట. ‘రుద్రమదేవి’ అనుభవంతో గుణశేఖర్ యమ స్పీడు అందుకున్నట్లే ఉన్నాడు. చారిత్రక నేపథ్యం ఉన్న భారీ చిత్రాలను ఇంత వేగంగా తీయడం చిన్న విషయం కాదు. ఇది చాలామంది ఫిలిం మేకర్స్‌కి స్ఫూర్తినిచ్చే విషయమే. ఇందుకుగాను ఆయనకో వీరతాడు వేయాల్సిందే.