జగన్ను అసలు మోడి పట్టించుకోవటం లేదా ?

ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇదే డౌటు పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాదు కదా కనీసం రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవటంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిలయ్యారనే చర్చ పెరిగిపోతోంది. తాజాగా కేంద్రం న్యాయశాఖ మంత్రిని కిరణ్ రిజుజును వైసీపీ ఎంపిల బృందం కలిసి చేసిన విన్నపాలను చూసిన తర్వాత అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి.

విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపిల బృందం కొన్ని విజ్ఞప్తులు చేసింది. అందులో మొదటిది ఫిరాయింపులకు పాల్పడేవారిపై కచ్చితమైన గడువులోగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక రెండోది అమరావతిలోని ఉన్న హైకోర్టును కర్నూలుకు రీ లోకెట్ చేయటం. నిజానికి ఈ రెండు కూడా రాజకీయ ప్రయోజనాలే అనటంలో సందేహంలేదు. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటుకు సంబంధించే ఫిరాయింపు ఎంపిలపై చర్యలకు కచ్చితమైన గడువుండాలని ఎంపిలు కోరింది.

ఇక్కడ విషయం ఏమిటంటే తిరుగుబాటు ఎంపి ఏపార్టీలోకి పిరాయించలేదు. కాబట్టి ఫిరాయింపుల నిరోధక చట్టం ఎంపికి వర్తించదు. వైసీపీ ఎంపి ముసుగులో చంద్రబాబునాయుడు అండ్ కో తో అంటకాగుతున్నది నిజం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడే కేంద్రంలో జగన్ కున్న పలుకుబడి ఏమిటనేది తేలుతుంది. గడచిన ఏడాదిపైనుండి ఎంపిపై అనర్హత వేటు వేయమని వైసీపీ ఎంపిలు అడుగుతునే ఉన్నారు, నరేంద్రమోడి, అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సరేనంటునే ఉన్నారు.

జగన్ తో ఎలాంటి అవసరమూ లేదుకాబట్టే మోడి అన్నింటికీ తలూపుతున్నారే కానీ ఏ డిమాండ్ నెరవేరటంలేదు. ఇక హైకోర్టును కర్నూలుకు తలించటం కూడా కేంద్రానికి పెద్ద పనికాదు. ఓసారి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ తో అమిత్ షా మాట్లాడితే తేలిగ్గానే అయిపోవచ్చు. కానీ ఆ విషయం కూడా ఎన్నిరోజులైనా ముందుకు అడుగు పడటంలేదు. హైకోర్టు రీ లొకేషన్ కు సుప్రింకోర్టు, కేంద్రం ఓకే అంటే ఏపికి మూడు రాజధానులు ఏర్పడినట్లే. రీ లొకేషన్ అనుమతి రాని కారణంగానే జగన్ వైజాగ్ వెళ్ళటంలో లేటవుతోంది.

నిజానికి జగన్ పెడుతున్న పై రెండు డిమాండ్లలో కర్నూలు లో హైకోర్టన్నది 2019 ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టోలోనే ఉంది. తమ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న అంశాన్ని జగన్ ఆచరణలోకి తెస్తానంటున్నా ఎందుకనో కేంద్రంలో స్పీడు కనబడటంలేదు. అంటే ఢిల్లీ స్ధాయిలో జరుగుతున్నది చూసిన తర్వాత జగన్ను ప్రధానమంత్రి పట్టించుకోవటంలేదా ? అనే సందేహాలు పెరగక ఏమవుతాయి.