పెరిగిపోతున్న టెన్షన్

ఆగస్టు 16 దగ్గరకు వస్తున్న కొద్దీ చాలామందిలో టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే రేపు 16వ తేదీనుండి రాష్ట్రంలో హై స్కూళ్ళు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడమే. మొదటి నుండి పరీక్షలు నిర్వహించడం, స్కూళ్ళు తెరవటంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అయితే ప్రభుత్వం ఉత్సాహంపై కరోనా వైరస్ ఎప్పటికప్పుడు నీళ్ళు జల్లుతునే ఉంది. ప్రతిపక్షాల డిమాండ్లు, కోర్టులో కేసుల వల్ల చివరకు పరీక్షలు పెట్టకుండానే అందరినీ పాస్ అనిపించేసింది ప్రభుత్వం.

ఇక స్కూళ్ళ ఓపెనింగ్ మిగిలిపోయింది. ఈనెల 16 నుండి స్కూళ్లను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా మొదలైన సమస్య ఏమిటంటే తగ్గినట్లే తగ్గిన కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆగస్టు నుండే థర్డ్ వేవ్ మొదలైందని దీని ప్రభావం అక్టోబర్ వరకు కంటిన్యూ అవుతుందని ఒకవైపు శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్ధాలు తప్పవని కూడా వార్నింగులిస్తున్నారు.

థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో స్కూళ్ళు తెరవటమంటే రిస్క్ ను ఆహ్వానించటమనే విషయాన్ని ప్రభుత్వం మరచిపోతోంది. ఒకేసారి వేలాది స్కూళ్ళను తెరిచి లక్షలాది మంది విద్యార్ధులను ఒకచోట చేర్చటం వల్ల కరోనా సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని ప్రభుత్వం ఎందుకనో మరచిపోతున్నట్లుంది. ఎంతసేపు స్కూళ్లు తెరవాలన్న పట్టుదలే కానీ పిల్లల భద్రత విషయం ఎందుకో గాలికొదిలేస్తోంది.

దేశంలో 16 రాష్ట్రాల్లో ఈ నెలలోనే స్కూళ్లు తెరవాలని డిసైడ్ అయ్యాయి. అయితే తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా మంగళవారం సుమారు 2 వేల కేసులు నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్ డౌన్ ఎత్తేసిన కారణంగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ఏపీలో కర్ఫ్యూ అమలులో ఉన్నా కేసులు పెరుగుతున్నాయి.

తల్లిదండ్రులు కూడా కరోనా వైరస్ భయం వల్ల తమ పిల్లలను స్కూళ్ళకు పంపడానికి భయపడుతున్నారు. స్కూళ్ళు తెరిచేలోగా టీచర్లందరికీ నూరుశాతం వ్యాక్సినేషన్ వేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ ప్రకటన నూరుశాతం అమల్లోకి రాలేదు. వ్యాక్సినేషన్ కొరత కారణంగా టీచర్లందరికీ టీకాలను వేయించ లేకపోయింది. టీచర్ల కే టీకాలు వేయించలేకపోయినపుడు ఇక విద్యార్ధుల సంగతేమిటి ? అనేదిపుడు ప్రశ్నగా మారింది.