ఈటలను టీఆర్ఎస్సే ప్రమోట్ చేస్తోందా ?

అధికార టీఆర్ఎస్ తీసుకున్న తాజా నిర్ణయం చాలా విచిత్రంగా ఉంది. అధికారపార్టీ తీసుకున్న నిర్ణయం గనుక అమల్లోకి వస్తే తానే ఈటల రాజేందర్ ను ప్రమోట్ చేసినట్లవుతుందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కేసీయార్ చాలా పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే. మంత్రివర్గంలో నుండి ఈటలను బహిష్కరించిన తర్వాత నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి.

మంత్రివర్గం నుండి బహిష్కరణకు గురైన ఈటల తర్వాత ఎంఎల్ఏగా రాజీనామా చేయటంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని ఈటల కూడా భారీ ప్లాన్లతో నియోజకవర్గంలో చొచ్చుకుపోతున్నారు. గడచిన ఏడేళ్ళుగా తాను నియోజకవర్గానికి చేసిన సేవలను ప్రజలకు పదే పదే గుర్తుచేస్తున్నారు. అనేక రూపాల్లో ఈటల జనాలను కలుస్తున్నారు. ఈటల బీజేపీలో చేరటంతో కమలనాదులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఈ విషయాలు ఇలావుండగానే ఈటలను దెబ్బకొట్టడానికే కేసీయార్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. అలాగే సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పథకాలను కూడా మొదలుపెట్టేశారు. ఈ నేపధ్యంలోనే నియోజకవర్గంలోని సుమారు 2 లక్షలమంది ఓటర్లకు కేసీయార్ పేరుతో నేరుగా లేఖలు రాయాలని టీఆర్ఎస్ డిసైడ్ అయ్యింది. గడచిన ఏడేళ్ళుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలని అనుకున్నది.

ఈ లేఖలు రాయటం గనుక ఆచరణలోకి వస్తే అది పరోక్షంగా ఈటలను ప్రమోట్ చేయటమే అన్న విషయాన్ని టీఆర్ఎస్ ఆలోచించటంలేదు. ఎలాగంటే గడచిన ఏడేళ్ళుగా ఈ నియోజకవర్గం నుండి ఈటలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి హోదాలో తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. అంటే ఈటల చెబుతున్నది, టీఆర్ఎస్ చెప్పబోయేది రెండు ఒకటే. ఒకవైపేమో నియోజకవర్గాన్ని ఈటెల గాలికొదిలేశారని కొందరు మంత్రులు పదే పదే ఆరోపిస్తున్నారు.

ఇదే సమయంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని లేఖల రూపంలో వివరించబోతున్నారు. అంటే ప్రభుత్వం చేసినట్లు చెప్పుకుంటున్న అభివృద్ధంతా ఈటల ఆధ్వర్యంలో జరిగినట్లే అన్న విషయాన్ని టీఆర్ఎస్ పోరక్షంగా అంగీకరిస్తున్నట్లే కదా. అంటే ఈటలను టీఆర్ఎస్సే ప్రమోట్ చేస్తున్నట్లు జనాలు అర్ధం చేసుకుంటే అది వాళ్ళ తప్పుకాదు. చివరకు ఉపఎన్నికలో కేసీయార్ సెల్ఫ్ గోల్ వేసుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదేమో.