#RRR.. ఆయన రంగంలోకి దిగాడు

#RRR.. ఆయన రంగంలోకి దిగాడు

దర్శక ధీరుడు రాజమౌళి తర్వాతి సినిమా కోసం భారతీయ సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలల సస్పెన్సుకు తెరదించుతూ గత ఏడాదే తన కొత్త సినిమాను ప్రకటించాడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్‌ల మెగా కాంబినేషన్లో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించినున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆరు నెలలుగా ప్రి ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇన్ని రోజులూ నేరుగా రంగంలోకి దిగకుండా పేపర్ మీదే ప్రి ప్రొడక్షన్ వర్క్ నడిచింది.

ఐతే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన టీం నేరుగా ఫీల్డ్‌లోకి దిగేసినట్లు సమాచారం. ‘బాహుబలి’కి ప్రొడక్షన్ డిజైన్ చేసిన లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిలే ఈ సినిమాకు కూడా పని చేస్తున్నారట. ఆయన ఆధ్వర్యంలో తెలుగు సినిమా షూటింగులకు ప్రధాన కేంద్రమైన అల్యూమినియం ఫ్యాక్టరీలో వర్క్ నడుస్తున్నట్లు సమాచారం.

అక్కడ భారీ ఎత్తున సెట్టింగ్స్ నిర్మాణం జరుగుతున్నాయట. నిర్మాత డీవీవీ దానయ్య అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంత స్థలాన్ని రెండేళ్ల కాలానికి లీజుకు తీసుకున్నారట. అక్కడే సినిమాలోని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నారట. రాజమౌళి కూడా వెళ్లి పనుల్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కథ ఇదని.. తారక్, చరణ్‌ల పాత్రలు ఇవనీ రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. కానీ వాటిలో నిజానిజాలెంతో రాజమౌళికే తెలియాలి.

ఈ ఏడాది చివరి లోపు ప్రి ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తవుతుందని.. ప్రస్తుతం వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న తారక్, చరణ్ అప్పటికి ఫ్రీ అయిపోతారని.. అప్పటి నుంచి ఇక విరామం లేకుండా చిత్రీకరణ జరుపుతారని సమాచారం. రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని వార్తలొస్తున్నాయి.



 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు