రష్మిక అమ్మా నాన్నలకు ఇష్టం లేకున్నా..

ప్రస్తుతం ఇండియాలో బహు భాషల్లో నటిస్తూ హవా సాగిస్తున్న కథానాయిక రష్మిక మందన్నా. ఈ బెంగళూరు అమ్మాయి ‘కిరిక్ పార్టీ’ అనే చిన్న సినిమాతో కన్నడలో నటిగా పరిచయం అయింది. ఆ సినిమా సూపర్ హిట్టయి ఆమె జీవితాన్ని మార్చేసింది. తెలుగులో కూడా ‘ఛలో’ అనే చిన్న బడ్జెట్ సినిమాతోనే రష్మిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్టయి.. ఆ తర్వాత నటించిన ‘గీత గోవిందం’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఇక ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఆల్రెడీ తమిళంలో కూడా అడుగు పెట్టిన రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్లో ఒకేసారి రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సిద్దార్థ్ మల్హోత్రా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’ కాగా.. ఇంకోటి అమితాబ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత రష్మిక ముంబయిలోనే ఉండి హిందీ చిత్రాల షూటింగ్‌లో పాల్గొంది.

ఇప్పుడు తిరిగి టాలీవుడ్‌కు వచ్చి.. శర్వానంద్ సరసన ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’లో నటిస్తోంది. త్వరలోనే ఆమె ‘పుష్ప’ చిత్రీకరణకు కూడా హాజరు కావాల్సి ఉంది. వివిధ భాషల్లో నటిస్తూ ఇంత బిజీగా ఉండటం ఏ నటికైనా ఆనందమే. కానీ రష్మిక ఇంట్లో మాత్రం ఈ విషయంలో అంత సంతోషంగా లేరట. కరోనా ముప్పు కొనసాగుతుండగా.. ఇలా ఆమె తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటుండటం.. ప్రయాణాలు చేస్తూ చాలామందిని కలుస్తుండటం పట్ల వాళ్లు చాలా బాధ పడుతున్నారట. అప్పుడే ఎందుకు షూటింగ్స్ మొదలుపెట్టేశావు.. ఇంకా కొంత కాలం ఆగాల్సిందని ఆమెతో అన్నారట.

ఐతే తాను చేస్తున్నవన్నీ పెద్ద సినిమాలు కావడం.. షూటింగ్స్ చాలామంది ఆర్టిస్టుల డేట్లతో ముడిపడి ఉండటంతో తాను షూటింగ్‌కు రాలేనని చెప్పలేని పరిస్థితి అని.. అందుకే అత్యంత జాగ్రత్తల మధ్య షూటింగ్‌లో పాల్గొంటున్నానని.. అమ్మానాన్నలకు ఇష్టం లేకపోయినా ఇది తప్పట్లేదని ఆమె అంది.